ప్రధాని మోదీపై నోరుపారేసుకున్న ఖర్గే తనయుడు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు నోరు పారేసుకోవడం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానిని `విషపు పురుగు’ అంటూ నిందించి దిద్దుబాటు చేసుకొనే ప్రయత్నం చేయగా, తాజాగా ఆయన కుమారుడు, ఎమ్యెల్యే ప్రియాంక ఖర్గే కూడా అనుచిత వాఖ్యలు చేశారు.
 
కలబురిగి జిల్లా పర్యటనలో భాగంగా బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీని `నాలాయక్ బేటా’ అని సంబోధించారు. `నాలాయక్ బేటా’ అంటే `పనికిమాలిన కుమారుడు’ అని అర్థం.  ప్రధాని మోదీ ఇటీవలే కర్ణాటక పర్యటనలో భాగంగా బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు.
 
దీనికి కౌంటర్‌గా ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని తనను తాను బంజారాల కుమారుడంటూనే బంజారాలను మోసం చేశారని, రిజర్వేషన్ల విషయంలో బంజారాలను అయోమయంలో పడేశారని ఆరోపించారు. అంతేకాదు ప్రధానిని `నాలాయక్ బేటా’ అని కూడా ధ్వజమెత్తారు. ప్రియాంక్ ఖర్గే తండ్రి మల్లికార్జున ఖర్గే నాలుగు రోజుల కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధానిని `విషపు సర్పం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మోదీ విషపాము అని విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే హెచ్చరించారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో తన వ్యాఖ్యలు మోదీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకొంటూ క్షమాపణలు కూడా చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ కొనసాగుతుండగానే ఆయన తనయుడు ప్రియాంక్ ఖర్గే కూడా ప్రధానిపై నోరుపారేసుకోవడం దుమారం రేపుతోంది. మల్లికార్జున ఖర్గేపై బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. మోదీని ` మౌత్ కా సౌదాగర్ ‘ర్ (మృత్యు వ్యాపారి) అని ఇదివరలో గుజరాత్ ఎన్నికల సమయంలో స్వయంగా సోనియా గాంధీ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని మణిశంకర్ అయ్యర్ గతంలో ప్రధానికి హితవు చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. ఎన్నికల్లో మాత్రం లబ్ది పొందలేకపోయారు. కాంగ్రెస్ నేతలు తనను ఇప్పటివరకూ 91 తిట్లు తిట్టారని ప్రధాని మోదీ రెండు రోజులక్రితం కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనే చెబుతూ వారి తిట్లే తనకు ఓట్లుగా మారుతాయని ఎద్దేవా చేశారు.