ఉచిత గ్యాస్ సిలిండర్లు, నందినీ పాలు.. బీజేపీ హామీ

కర్ణాటకలో అధికార పక్షం గెలుపొందని నాలుగు దశాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెట్టి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న  బీజేపీ సోమవారం ఎన్నికల ప్రణాలికను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా “ప్రజా ప్రణాళిక” పేరుతో బీజేపీ ఎన్నికల ప్రణాళికను  విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.ఈ ప్రణాళికలో బిజెపి 39 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, యూనిఫామ్ సివిల్ కోడ్, నందినీ పాల ఉత్పత్తి వంటి అంశాలున్నాయి.

మేనిఫెస్టోలో కీలక అంశాలు

* పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. వీటిని ఉగాది, వినాయకచవితి, దీపావళి పండుగల సమయంలో ఇస్తారు.

* అన్ని వార్డుల్లో అటల్ ఆహార కేంద్రాలు నెలకొల్పి నాణ్యమైన ఆహారం అందిస్తారు.

* పోషణే స్కీమ్ ద్వారా  పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి రోజూ అర లీటర్ నందినీ పాలను రోజూ ఇస్తారు. అలాగే శ్రీ అన్న – శ్రీ ధాన్య కింద నెలవారీ రేషన్ కిట్ ‌లో 5 కేజీల బియ్యం ఇస్తారు.

*  కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు. దీని కోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. దాని సిఫార్సులను పరిగణలోకి తీసుకుని యూసీసీని అమలు చేస్తారు.

* ఇళ్లు లేని 10 లక్షల మందికి సర్వరిగు షురు యోజన కింద ఇళ్ల స్థలాలను ఇస్తారు.

* ఒనకే ఒబవ్వ సామాజిక న్యాయ నిధి కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి తరపున రూ. 10వేలను 5 ఏళ్ల కాలానికి ఫిక్సడ్  డిపాజిట్ చేస్తారు.

* విశ్వేశ్వరాయ విద్యా యోజన పథకం కింద విద్యా వ్యవస్థలో టాప్ క్లాస్ ప్రమాణాలను తెస్తారు.

* కర్ణాటక రెసిడెంట్స్​ వెల్ఫేర్​ కన్సల్టేటివ్​ కమిటీని ఏర్పాటు చేయడం- ఫలితంగా.. బెంగళూరులో నివాసం ఉంటున్న వారి సౌలభ్యాన్ని మెరుగుపరచడం.

* కర్ణాటకను ఎలక్ట్రిక్​ వెహికిల్​ (ఈవీ) హబ్​గా అభివృద్ధి చేయడం.

మైసూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.  విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించింది.  వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. 

ఇలా ఆహారం, అభయం, అక్షరం, ఆరోగ్యం, అభివృద్ధి అంశాలతో మేనిఫెస్టోని రూపొందించింది బీజేపీ. 6 లక్షల మందికి పైగా ప్రజల సూచనలను లెక్కలోకి తీసుకొని ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. దాదాపు 20వేలకు పైగా ఆన్‌లైన్ సూచనల్ని పరిగణనలోకి తీసుకుంది. 170 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. అలాగే నిపుణుల నుంచి 900 సూచనల్ని స్వీకరించింది. 50 రంగాలకు సంబంధించిన ప్రత్యేక నిపుణుల అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకొని మేనిఫెస్టోని తయారుచేసింది.