
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ను థాయ్‌లాండ్ పోలీసులు గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడనే కారణంతో అరెస్ట్ చేశారు. చికోటితో పాటు మాధవరెడ్డి, డిసీసీబి చైర్మన్ దేవేందర్ రెడ్డిలను కూడా సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మంది ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 80 మంది వరకు భారతీయులే ఉన్నారు.
అరెస్ట్ అయిన వారిలో 71 మంది పరుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. గ్యాంబ్లింగ్ జరిగిన స్థలంలో రూ.20.92 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్‍లను, రూ.1,60,000 విలువైన భారతీయ కరెన్సీని పటాయా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వహణలో సిత్రనన్ కయివ్లోర్ అనే మహిళది కీలక పాత్ర అని పోలీసులు గుర్తించారు. భారతీయ టూరిస్టుల నుంచి ఒక్కొక్కరి దగ్గర 50వేల బాట్లను (సుమారు రూ.1.19లక్షలు) వసూలు చేసినట్టు పోలీసులకు ఆమె చెప్పారు.
అయితే, ఈ గ్యాంబ్లింగ్ నిర్వహణలో చికోటి ప్రవీణ్ కూడా కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. భారతీయులను థాయ్‍ల్యాండ్‍కు అతడే తీసుకెళ్లాడని తెలుస్తోంది. గ్యాంబ్లింగ్ నిర్వహణ కోసం ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు హోటల్‍లో రూమ్‍లను అద్దెకు తీసుకున్నట్టుగా పటాయా పోలీసులు గుర్తించారు.
హోటల్‌లోకి చాలామంది భారతీయ టూరిస్టులు శనివారం వచ్చారని, వారంతా సోమవారం ఖాళీ చేయనున్నారని పోలీసులకు సమాచారం అందిందని చొన్బూరీ పోలీసు అధిపతి పాల్ మేజర్ జనరల్ కాంపోల్ లీలాప్రభాపార్న్ విలేకరులకు తెలిపారు. హోటల్‌లోని కన్వెన్షన్ హాలును తాత్కాలిక క్యాసినోగా మార్చినట్లు కూడా పోలీసులకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.
అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు. గ్యాంబ్లింగ్ కోసం కొంతమంది భారతీయులను కూడా అక్కడకు చికోటి ప్రవీణ్ తీసుకెళ్లాడు. అరెస్ట్ అయిన వారిలో కృష్ణాజిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. థాయ్‌లాండ్‌లో జూదంపై నిషేధం అమల్లోకి ఉంది. దీంతో గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
థాయ్‌లాండ్‌లో చట్టాలు కఠినంగా ఉంటాయని తెలియడంతో పట్టుబడిన గ్యాంబ్లింగ్ బ్యాచ్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఇప్పటికే చికోటి ప్రవీణ్‌పై హైదరాబాద్ లో క్యాసినో కేసు కొనసాగుతోంది. క్యాసిన్ వ్యవహారంలో నిధుల మళ్లింపు, హవాలా లావాదేవీలపై ఇప్పటికే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ ముందు చికోటి ప్రవీణ్ విచారణకు హాజరయ్యాడు. చికోటి ప్రవీణ్ బ్యాంకు లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఈడీ పరిశీలించింది. గతంలో గోవాలో పలుమార్లు చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించాడు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా క్యాసినో ఆడినట్లు తేలింది. అన్ని పార్టీల నేతలతో చికోటి ప్రవీణ్‌కు పరిచయాలు ఉన్నాయి. అలాగే పలువురు సెలబ్రెటీలతో కూడా ప్రవీణ్‌కు సాన్నిహిత్యం ఉంది.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు