14 మెసెంజర్ యాప్స్ లపై నిషేధం

కేంద్ర ప్రభుత్వం సోమవారం ఏకంగా 14 మొబైల్ యాప్స్ ను నిషేధించింది. అంతే కాదు వీటిని బ్లాక్ కూడా చేసేసింది. ఇవన్నీ మొబైల్ మెసెంజర్ యాప్ లు కావడం విశేషం. వీటిని బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం దీని వెనుక ఉన్న బలమైన కారణాన్ని కూడా వెల్లడించింది.
 
దీంతో ఆయా యాప్స్ ఇప్పుడు మీ మొబైల్స్ లో అందుబాటులో లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాల అణిచివేతలో భాగంగా కేంద్రం ఇవాళ 14 మొబైల్ మెసెంజర్ యాప్స్ ను బ్లాక్ చేసింది. ఆయా యాప్స్ ద్వారా దేశంలో తీవ్రవాద ప్రచారం, కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నట్లు కేంద్రం నిర్ధారణకు వచ్చింది.
 
దీంతో ఈ నెట్ వర్క్ ను బ్రేక్ చేయడానికి సదరు యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్లాక్ అయిన వాటిలో క్రిప్విజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్‌మి, మీడియాఫైర్, బ్రెయర్, బీచాట్, నాండ్‌బాక్స్, కోనిఅన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి, థ్రీమా ఉన్నాయి.

తీవ్రవాదులు ఆయా మెసెంజర్ యాప్ ల్లో తమ మద్దతుదారులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లతో సమాచారం పంచుకోవడానికి, సూచనలను స్వీకరించడానికి వాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్‌లను కేంద్రం నిషేధించింది.
పాకిస్తాన్ నుండి వీటిని ఆపరేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో భద్రతా, నిఘా సంస్థల సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే భారత చట్టాలను పాటించని యాప్‌ల జాబితాను భద్రతా సంస్ధలు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాయి. దీంతో వాటిని నిషేధించాలన్న సూచనను కేంద్రం ఆమోదించింది. ఈ యాప్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69ఎ కింద బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇలాంటి యాప్స్ మీరు కూడా వాడుతూ ఉంటే వెంటనే ఫోన్‌ నుంచి తొలగించుకోవడం ఉత్తమం. కాగా ప్రభుత్వం ఇలా యాప్స్‌ను నిషేధించడం ఇదేమీ కొత్త కాదు. ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు యాప్స్‌‌పై నిషేధం విధిస్తూ వచ్చింది. పబ్‌జి వంటి ప్రముఖ యాప్స్‌పై వేటు పడిన ఘటనలు జరిగాయి. కాగా స్మార్ట్ ఫోన్  వాడే వారు కేవలం ప్లేస్టోర్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం. థర్డ్ పార్టీ స్టోర్స్ నుంచి లేదంటే బ్రౌజర్ ద్వారా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫోన్ హ్యాక్ కావొచ్చు. మోసగాళ్లు మీ విలువైన బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను తస్కరించే అవకాశం ఉంటుంది.