షిర్డీ సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది

మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయం మే 1న, ఆ తర్వాత కూడా తెరిచే ఉంటుందని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ స్పష్టం చేసింది. సాయిబాబా దర్శనం, పూజలు, నిత్యం జరిగే నాలుగు హారతులు యథాప్రకారం జరుగుతాయని ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. షిర్డీ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర సర్కార్ చేసిన ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేసిన షిర్డీ గ్రామస్థులు మే 1 నుంచి షిర్డీ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్టు తాజా ప్రకటన చేసింది.

మే 1న యథాప్రకారం భక్తులకు సాయిబాబా దర్శనం, పూజలు, నిత్యహారతులు కొనసాగుతాయని, శ్రీ సాయి ప్రసాదాలయం, భక్త నివాస్ ప్రాంతాలు, ఆసుపత్రుల్లో సంస్థా్న్ కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు యథాప్రకారం కొనసాగుతాయని సంస్థాన్ ట్రస్టు తెలిపింది. షిర్డీ సాయిబాబా ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని ఇటీవల నిర్ణయించింది. దీనిపై షిర్డీ గ్రామస్థులు, అఖిలపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆలయ భద్రతను సీఐఎస్ఎఫ్‌కు అప్పగిస్తే, స్థానికులు, పర్యాటకులు, ఇతరులపై ఆంక్షలు తీవ్రమవుతాయని, దీంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, విమానాశ్రయాలు, మెట్రో రైళ్లకు భద్రత కల్పించే సీఐఎస్ఎఫ్‌ను ఆలయ భద్రతకు కేటాయించడంపై నిలదీస్తున్నారు.

ఆలయ భద్రతకు సంబంధించి సీఐఎస్ఎఫ్‌కు తగిన శిక్షణ కానీ, ఎక్విప్‌మెంట్ కానీ లేవని అంటున్నారు. ప్రస్తుతం ఆలయ భద్రతను సంస్థాన్ ట్రస్టు చూస్తుండగా, ప్రాంగణం భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ప్రతిరోజూ బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా జరుగుతుంటాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా అహ్మద్‌నగర్-మన్మాడ్ హైవేపై ప్రధాన ఆలయం ఉంది. 4.5 ఎకరాల స్థలంలో ఆలయం ఉండగా, 350 ఎకరాల్లో సంస్థాన్ ట్రస్టు కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఛారిటీ స్కూళ్లు, కాలేజీలు, ఐటీఐ, తాగునీటి వసతులు, ఆసుపత్రులను ట్రస్టు నిర్వహిస్తోంది.

షిర్డీ జనాభా సుమారు 25,000 మంది కాగా, మతవిశ్వాసాలకు అతీతంగా ప్రతిరోజూ 50,000కు పైగా భక్తులు ఆలయాన్ని దర్శిస్తుంటారు. దేశవిదేశాల్లోని 2 కోట్లకు పైగా భక్తులు ఏటా బాబాను దర్శించుకుంటారు. షిర్డీ సాయి ఆలయానికి సీఐఎస్ఎఫ్‌ భద్రత వద్దంటూ మే 1 నుంచి షిర్డీ నిరవధిక బంద్‌కు గ్రామస్థులు పిలుపునిచ్చారు.

అయితే, ఆలయానికి వచ్చే భక్తులకు భోజన, వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. అయితే, మార్కెట్లు, రవాణా సౌకర్యాలు బంద్ అవుతాయని తెలిపారు. మే 1న సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని కూడా ప్రకటించారు. షిర్డీ సంస్థాన్ సైతం సంస్థాన్ సేవలు కొనసాగుతాయని, ఆలయం తెరిచే ఉంటుందని ప్రకటించింది.