లూధియానాలో గ్యాస్ లీకేజీ.. 11 మంది మృతి

పంజాబ్‌లోని గాయాస్‌పూర్ ప్రాంతంలో ఆదివారం గ్యాస్ లీక్ ఘటనలో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. అస్వస్థతకు గురైన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. లీకేజీకి కారణం, గ్యాస్ రకం ఇంకా నిర్ధారించబడలేదు. ఉదయం 7.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌ల్లో బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.ఆ ప్రాంతాన్ని సీల్ చేసి అగ్నిమాపకదళం శకటాలను, అంబులెన్స్‌ను పంపించారు. 50 మంది సభ్యులున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం(ఎన్‌డిఆర్‌ఎఫ్) కూడా అక్కడికి చేరుకుంది.

మరణించిన 11 మందిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు.  10, 13 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు కూడా ఉన్నారని వారు తెలిపారు. మరణాలకు కారణమై గ్యాస్ ఏమిటో తెలిశాకే దాని గురించి తెలుపుతామని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతం జనసమర్ధమైన ప్రాంతం కావడంతో అక్కడి వారిని ఖాళీ చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దుర్ఘటన చాలా బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేశారు. వీలయినంత సాయం అందిస్తానని చెప్పారు. అక్కడ జిల్లా అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ పనిచేస్తున్నారని ఆయన పంజాబీలో ఓ ట్వీట్ కూడా చేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల ఉత్పత్తులను సంబంధించిన ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయినట్లు తెలిసింది. గోయల్ మిల్క్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ నుంచి విషవాయువు వెలువడినట్లు సమాచారం. ఆ విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ సమీపంలో నివసిస్తున్న పలువురు స్పృహతప్పి పడిపోయారు. పలువురు శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.