జెఇఇ మెయిన్స్‌ లో తెలుగు విద్యార్థుల సత్తా

ఈ ఏడాది జెఇఇ మెయిన్స్‌ పరీక్షా ఫలితాలను శనివారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. 43 మంది అభ్యర్ధులు 300కి 300 మార్కులు సాధించి వంద శాతంను సాధించారని ఈ పరీక్షను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రకటించింది.  2023 సంవత్సరానికి నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఇఇ) మెయిన్‌ రెండవ సెషన్‌ ఫలితాలను శనివారం వెల్లడించారు.

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో, నిట్‌లు, ఐఐటిల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది. ఐఐటి జెఇఇ అభ్యర్ధులకు ఇదొక స్క్రీనింగ్‌ పరీక్ష వంటిది.  కేవలం పేపర్‌ వన్‌ (బిఇ, బిటెక్‌) ఫలితాలు మాత్రమే శనివారం ప్రకటించారు. ఇంకా బి ఆర్క్‌, బి ప్లానింగ్‌ ఫలితాలు రావాల్సి వుంది.
తెలంగాణాకు చెందిన సింగరాజు వెంకట్‌ కౌండిన్య అత్యధిక మార్కులు సాధించాడు.

ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కాళ్లకూరి సాయినాథ్‌ శ్రీమంత్‌, రాజస్థాన్‌కి చెందిన ఇషాన్‌ ఖండేల్‌వాల్‌, ఉత్తరప్రదేశ్‌కి చెందిన దేశాంక్‌ ప్రతాప్‌ సింగ్‌, నిపున్‌ గోయల్‌ వునాురు. వంద పర్సంటైల్‌ సాధించిన 43మందిలో వీరున్నారు.  ఇక బాలికలలో కర్ణాటకకుచెందిన రిధి కమలేష్‌ కుమార్‌ మహేశ్వరి వంద పర్సంటైల్‌ మార్కులతో టాప్‌లో నిలిచింది. జెఇఇ మెయిన్స్‌లో వంద పర్సంటైల్‌ సాధించిన ఏకైక మహిళా అభ్యర్ధిగా ఆమె నిలిచారు.

జెఇఇ మెయిన్స్‌లో తొలి పది స్థానాలు సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణ వారు కాగా, ఒకరు ఏపీ విద్యార్ధి. యుపి నుండి ఇద్దరు, రాజస్థాన్, గుజరాత్ ల నుండి ఒకరొక్కరు ఉన్నారు.

1. సింగరాజు వెంకట్‌ కౌండిన్య (తెలంగాణా), 2. కాళ్లకూరి సాయినాధన్‌ శ్రీమంత్‌ (ఆంధ్రప్రదేశ్‌), 3. ఇషాన్‌ ఖండేల్‌వాల్‌ (రాజస్థాన్‌), 4. దేశాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ (యుపి), 5. నిపున్‌ గోయల్‌ (యుపి), 6. అల్లం సంజరు (తెలంగాణా), 7. వావిలాల చిద్విలాస్‌ రెడ్డి (తెలంగాణా), 8. బిక్కిన అభినవ్‌ చౌదరి (తెలంగాణా), 9. సుతార్‌ హర్‌శూల్‌ సంజరుభారు (గుజరాత్‌), 10. అభినీత్‌ మాజేటీ (తెలంగాణా).