తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పంటలు ధ్వంసమై రైతులు లబోదిబోమంటున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి.
 
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్ల చేరడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ పొంగిపోర్లుతున్నాయి. నాలాల వెంబడి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. బల్దియా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేసింది. జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షం నేపథ్యంలో రోడ్లు జలమయమైయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
 
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న గంటలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈదురుగాలులతో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్జ్‌ జారీ చేసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఆదివారం కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదైంది.

కాగా, తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరితోపాటు ఇతర పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవానలి కోరుతున్నారు.