ఇంటర్ ఫలితాల తర్వాత 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు

ఎపి బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎగ్జామినేషన్‌ బుధవారం ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ల ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల తర్వాత మనస్తాపానికి గురైన విద్యార్థులు ఎపిలో 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు.  2022-23 విద్యాసంవత్సరానికిగానూ దాదాపు 10 లక్షలమంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల్ని రాశారు.
అయితే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ కన్నా, ఫస్ట్‌ఇయర్‌ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ 61, సెకండ్‌ ఇయర్‌ 72 ఉత్తీర్ణత శాతంగా నమోదైనట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడించింది. కాగా, శ్రీకాకుళం జిల్లాలో బి. తరుణ్‌ (17) రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అదే జిలాలో దండు గోపాలపురం గ్రామానికి చెందిన మరో విద్యార్థి మొదటి సంవత్సరంలో ఎక్కువ సబ్జెక్టులలో తాను ఫెయిల్‌ అయ్యానని తెలుసుకున్న అతను తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
అలాగే విశాఖపట్నం జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని త్రినాథపురంలో తన నివాసంలోనే సూసైడ్‌ చేసుకుంది. ఇక ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అఖిలశ్రీ అనే అమ్మాయి కూడా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురైందని సమాచారం.
విశాఖపట్నంలోని కంచర్లపాలెంలో 18 ఏళ్ల యువకుడు ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టులోనే ఫెయిల్‌ అయ్యాడు. దీంతో అతను ఆవేదన చెంది తన నివాసంలోనే ఉరివేసుకున్నాడు.
చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఒక అమ్మాయి సరస్సులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. మరో విద్యార్థి పురుగుమందు తాగి మృతి చెందాడు. అనకాపల్లిలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో తాను అనుకున్న మార్కులు రాలేదని 17 ఏళ్ల యువకుడు తన నివాసంలోనే ఉరివేసుకుని మృతి చెందాడు. అనంతపురం కళ్యాణదుర్గానికి చెందిన మౌనిక అనే యువతి పురుగులమందు తాగి మృతి చెందింది.
 
ఈమె ప్రముఖ విద్యాసంస్థ నారాయణ కాలేజీలో ఎంపిసి ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. గణిత సబ్జెక్టులో ఆమె ఫెయిలైంది. దీంతో ఆమె పురుగుల మందుతాగి మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది.  ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాదు. భారతదేశంలో ప్రీమియర్‌ కాలేజీల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి)లోని వివిధ క్యాంపస్‌లలో ఈ ఏడాది నలుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా ఆత్మహత్యలు చేసుకుని మృతిచెందారు.  ఫిబ్రవరి నెలలో నమోదైన విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల విధివిధానాలు సరిగ్గాలేవని, దీంతో విద్యార్థులకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబ సభ్యులకు రోదన మిగులుస్తున్నారని ఆయన ఆందోళన చెందారు