మే 3 నుంచి ఢిల్లీలోని టీటీడీ బ్రహ్మోత్సవాలు

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఉత్సవాలు మే 3న అంకురార్పణతో ప్రారంభమై, 13న పుష్పయాగంతో ముగుస్తాయని పేర్కొన్నారు.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.  మే 8న స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించి ఢిల్లీలో ఏపీ,తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భవన్ లలో సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. యమున ఘాట్‌ లో చక్రస్నానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఆలయ ఆవరణలో నిర్మించిన యాగశాలను మే 8న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

కరోనా కారణంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తొలగించిన టీటీడీ సమాచార కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ చైర్మన్‌, ఈవోతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. జమ్ములో నిర్మిస్తున్న టీటీడీ ఆలయం జూన్ నాటికి పూర్తకావస్తుందని తెలిపారు.  జూన్ 3 నుంచి కుంభాభిషేకం ప్రారంభమవుతుందని ,జూన్ 8న విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.