జగన్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ సమర శంఖం

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై బీజేపీ సమర శంఖం పూరించనుంది. ఏపీలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్‌ లు దాఖలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి  ప్రతి పోలీస్ స్టేషన్‌లో చార్జిషీట్‌లతో పిర్యాదు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశించింది. అంశాల వారీ చార్జిషీట్‌లు రూపొందించేందుకు జాతీయ నాయకత్వం నలుగురు నేతలతో కమిటీ నియమించింది.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్‌లతో కమిటి ఏర్పాటు చేసింది.  మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి. వైజాగ్‌లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు… వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్‌లు రూపొందించనుంది.

బీజేపీ కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్‌లు దాఖలు చేయనున్నారు. ఐదు నెలల క్రితం  వైజాగ్‌లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.

కాగా, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేకపాలన, అవినీతి, అనైతిక చర్యలపై ప్రజలకు వాస్తవాలు వెలువరించేందుకు బిజెపి రాష్ట్ర కమిటీ బుధవారం రెండు కమిటీలను నియమించింది. కోర కమిటీలో అఖిల భారత సంహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ, బిజెపి ఎపి ఇన్‌చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌, సహ ఇన్‌చార్జి సునీల్‌దేవధర్‌ల ఆధ్వర్యంలో నియమించారు.

వీరితో పాటు 11 మంది సభ్యులతో చార్జిషీట్‌ కమిటీని నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో పార్టీ జాతీయ కార్యదర్శి దగ్గుపాటి పురంధరేశ్వరి, వై.సత్యకుమార్‌ల నేతృత్వంలో కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

కమిటీ కన్వీనరుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్‌ మాధవ్‌, కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌, జివిఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపి కొత్తపల్లి గీత, మాజీ సిఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, జాతీయ ఓబిసి మోర్చా సెక్రటరీ డాక్టర్‌ పార్థసారధి, మాజీఎమ్మెల్యే జయరాములు, ఆర్‌టిఐసెల్‌ స్టేట్‌ కన్వీనరు వి.శ్రీనివాస్‌బాబులను నియమించినట్లు తెలిపారు.