త‌మిళ‌నాడులో బిజెపి నేత దారుణ హ‌త్య‌

తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. సినీ ఫక్కీలో ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. చెన్నైలోని పూందిపలై హైవే నుంచి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్‌ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  చెన్నైలోని శ్రీపెరంబుదూరు పక్కనున్న వరకపురం పంచాయతీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా, బీజేపీ ఎస్సీ ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా పీబీజీ శంకర్ పనిచేస్తున్నారు.
శంకర్‌ చెన్నై నుంచి కారులో బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి వెళ్తున్నాడు.  ఈ క్రమంలో పూనమలీ సమీపంలోని నజరత్‌పేట జంక్షన్‌ వద్దకు కారు రాగానే  కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనాన్ని ఆపి నాటు బాంబులు విసిరారని పోలీసులు తెలిపారు. ధ్వంసమైన కారు కొద్ది దూరంలో ఆగింది. దీంతో కారు దిగి రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళుతోన్న బీజేపీ నేత శంకర్‌ను ఆ ముఠా వెంబడించి నరికి చంపింది.
 
రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో తరహాలో హత్య జరగడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. నజరత్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బిజెపి కార్యకర్త శంకర్ చంపివేతను ఖండించారు. ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) పాలనలో నేర ఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. ‘పోలీసులు ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలి. కానీ వారు అధికార పార్టీ ప్రచారక శాఖగా మారారు. హోం పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ శాంతిభద్రతలను హ్యాండిల్ చేయలేకపోతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం స్టాలిన్ ప్రజలను మోసగిస్తున్నారని, పైగా తానే నెం.1 సిఎంనని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నేరస్తులను వెంటనే పట్టుకోవాలని నేను డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే, తమిళనాడు రాష్ట్రమంతటా బిజెపి నిరసనలు చేపడుతుందని అన్నామలై హెచ్చరించారు.