నా కుమారై త‌న భ‌ర్త‌ని ప్ర‌ధానిని చేసింది.. సుధామూర్తి

తాను త‌న‌భ‌ర్త‌ని ఓ వ్యాపార‌వేత్త‌గా చేశాన‌ని. త‌న కుమారై ఆమె భ‌ర్త‌ని బ్రిట‌న్ ప్ర‌ధానిని చేసింద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, సమాజ సేవకురాలు సుధామూర్తి. “భర్తను ఓ భార్య ఎలా మార్చగలదో చూడండి. నేను మాత్రం నా భర్తను మార్చలేకపోయాను. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేస్తే, నా కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది” అని ఆమె చెప్పారు.
 
నారాయణమూర్తి, సుధామూర్తి కుమార్తె అయిన అక్షతామూర్తిని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ 2009లో ప్రేమ  వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా రిషి ఆహార అలవాట్లను మార్చడం, మత విశ్వాసాలన పెంపొందించడం వంటివి చేసిందని తెలిపారు. రిషి సునక్ అత్యంత చిన్న వయస్సులోనే బ్రిటన్ వంటి దేశానికి ప్రధాని అయ్యారని, రిషి సునక్  ఎదుగుదల వెనుక తన కూతురు అక్షత మూర్తి ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని సుధామూర్తి వెల్లడించారు.
ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సుధా మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కారణంగానే రిషి సునాక్ బ్రిటన్‌కు అత్యంత పిన్న వయసులో ప్రధాని కాగలిగాడని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉండడమే ఇందుకు కారణం..ఒక భర్తను భార్య ఎలా మారుస్తుందో మీరే చూడండి.. అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 
ప్రపంచంలోని సంపన్నులలో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వ్యక్తిగత ఆస్తులు దాదాపు 730 మిలియన్ డాలర్లు ఉంటాయి. అక్షతా మూర్తి కూడా తన తల్లిదండ్రుల లాగే నిరాడంబర జీవితాన్ని కోరుకుంటారు. రిషి సునాక్ ఎంపిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఏడేళ్లకే బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఖ్యాతి గడించారు.
 
తన అల్లుడు రిషి సునాక్ పూర్వీకులు 150 ఏళ్లుగా ఇంగ్లండ్‌లోనే ఉంటున్నారని, అయినప్పటికీ వారంతా చాలా దైవభక్తులని ఆమె తెలిపారు. తన వియ్యపురాలు(రిషి సునాక్ తల్లి) ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారని, కాని రిషి సునాక్ మాత్రం ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారని ఆమె వెల్లడించారు. వారి కుటుంబం ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా జీవిస్తుంటారని, మత విశ్వాసాలను పాటిస్తూ ఉంటారని సుధామూర్తి తెలిపారు.
గురువారం తమకు ఎంతో పవిత్రమైన రోజు అని వెల్లడించారు. అన్ని ముఖ్యమైన పనులను గురువారమే తాము ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తమ కుటుంబమంతా రాఘవేంద్ర స్వామి భక్తులమని తెలిపారు. ఇన్ఫోసిన్ ను కూడా గురువారమే ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. తన అల్లుడు రిషి సునక్ ప్రతీ గురువారం ఉపవాసం ఉంటాడని ఆమె వెల్లడించారు. “నా అల్లుడు తల్లి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే, అల్లుడు గురువారం ఉపవాసం ఉంటారు” అని సుధామూర్తి వివరించారు.