91 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్‌ కీ బాత్ ప్రోగ్రాంలో వందో ఎపిసొడ్ మరో రెండు రోజుల్లో ప్రసారం కానున్న నేపథ్యంలో దేశంలోని 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్‌లను మోదీ శుక్రవారం ప్రారంభించారు.  ఎఫ్‌ఎం రేడియో కనెక్టివిటీని పెంచడానికి ఈ కొత్త ట్రాన్స్‌మిటర్స్ ఏర్పాటు చేయగా, దీంతో రేడియో కవరేజీ సుమారు 35,000 చ.కి.మీ అదనంగా పెరిగింది.

అలాగే ఇప్పటి వరకు రేడియో కనెక్టివిటీ లేని మరో రెండు కోట్ల మందికి ఈ సదుపాయం కలిగింది. ఆకాంక్ష జిల్లాలు, సరిహద్దు ప్రాంతాలకు ఇప్పుడు రేడియో కనెక్టివిటీ పెరుగుతుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఎఫ్‌ఎం స్టేషన్లను ప్రారంభించిన సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ సకాలంలో సమాచారం అందించడం, వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ సూచనలు, లేదా మహిళా స్వయం సహాయక సంఘాలను కొత్త మార్కెట్‌లతో అనుసంధానం చేయడంలో ఈ ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

దేశంలో సాంకేతిక విప్లవంతో రేడియో కొత్త అవతార్‌లో ఆవిర్భవించిందని, కొత్త శ్రోతలను ఈ మీడియంకు తీసుకువచ్చిందని చెప్పారు. ‘ఆల్ ఇండియా రేడియో అందిస్తున్న ఎఫ్‌ఎం సేవ‌ల విస్త‌ర‌ణ అనేది.. ఈ నెట్‌వర్క్ ఆల్ ఇండియా ఎఫ్‌ఎంగా మారేందుకు ఒక పెద్ద, ముఖ్యమైన ముందడుగు. ఆల్ ఇండియా ఎఫ్‌ఎంకి చెందిన 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్స్ అందుబాటులోకి రావడం, దేశంలోని 85 జిల్లాల్లో, 2 కోట్ల మంది ప్రజలకు బహుమతి లాంటిది’  అని ప్రధాని తెలిపారు.

`ఎఫ్‌ఎం ఇన్ఫోటైన్‌మెంట్‌కు చాలా విలువ ఉంది. మా ప్రభుత్వం టెక్నాలజీ డెమోక్రనైజేషన్‌ కోసం నిరంతరం కృషి చేస్తోంది. ప్రతి పౌరుడికి టెక్నాలజీని చేరువ చేస్తున్నాం. ఆల్ ఇండియా రేడియో, దేశాన్ని అనుసంధానం చేసే దృక్పథంతో పనిచేస్తోంది. మొబైల్ డివైజ్‌లు, డేటా ప్లాన్‌లు చౌకగా మారడంతో ఇన్ఫర్మేషన్ విస్తృతంగా యాక్సెస్ చేయగలిగే అవకాశం కలిగింది’ అని ప్రధాని వివరించారు.

తన తరంలో ప్రజలు రేడియోకు ఎమోషనల్ ఆడియన్స్‌గా ఉండేవారని, ప్రేక్షకుడిగా, అలాగే హోస్ట్‌గా కూడా మారడం తనకు సంతోషకరమైన విషయమని మోదీ చెప్పారు. త్వరలో ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్‌ని హోస్ట్ చేయబోతున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఈ ప్రోగ్రామ్‌తో దేశవ్యాప్తంగా ప్రజలతో లోతైన అనుబంధం రేడియో ద్వారా తప్ప మరే ఇతర మాధ్యమం ద్వారా సాధ్యం అయ్యేది కాదని మోదీ పేర్కొన్నారు.

అంతకుముందు ఈ విషయంపై మోదీ ఒక ట్వీట్ చేశారు. ఈ ప్రయత్నం రేడియో మాధ్యమానికి ఊపునిస్తుందని, దానితో అనుసంధానమైన వారిని కూడా ప్రోత్సహిస్తుందని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ కొత్త ఎఫ్‌ఎం స్టేషన్లు బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్,   అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ,  ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర  వంటి రాష్ట్రాలతో పాటు లడఖ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి.