ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు

లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ పై సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్ లను దాఖలు చేశారు. తాను పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వెల్లడించారు. తాను చట్టం నుంచి పారిపోవడం లేదని, తాను తన నివాసంలోనే ఉన్నానని స్పష్టం చేశారు.

తానేమీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం లేద‌ని చెబుతూ రాజీనామా పెద్ద విష‌యం కాదని, కానీ తానేమీ క్రిమిన‌ల్‌ను కాద‌ని స్పష్టం చేశారు. ఒక‌వేళ తాను రిజైన్ చేస్తే, అప్పుడు రెజ్ల‌ర్ల ఆరోప‌ణ‌లు అంగీక‌రించిన‌ట్లు అవుతుంద‌ని బ్రిజ్ పేర్కొన్నారు. త‌న ప‌ద‌వీ కాలం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని, ప్ర‌భుత్వం త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేసింద‌ని, 45 రోజుల్లో ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని, ఆ ఎన్నిక‌ల త‌ర్వాత త‌న ట‌ర్మ్ ముగుస్తుంద‌ని బ్రిజ్ తెలిపారు.

అంతకు ముందు సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ బ్రిజ్‌ భూషణ్‌ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని రెజ్లర్ల తరఫున న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు.

దీనిపై సొలిసిటర్ జనరల్ మెహతా స్పష్టత ఇస్తూ ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కే వదిలేయాలని సూచించారు. పోలీస్ కమీషనర్ బాధ్యతగల అధికారి అని గుర్తు చేశారు. అనంతరం సీజేఐ డీవై చంద్రచూడ్‌ మాట్లాడుతూ ‘సొలిసిటర్‌ జనరల్‌.. మేము మీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నాం. ఒక వారం తర్వాత మాకు మరింత సమాచారం ఇవ్వాలి’ అని ఆదేశించారు. ఈ కేసు మళ్లీ వచ్చే శుక్రవారం విచారణకు రానుంది.

మరోవైపు బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన గద్దె దిగేవరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, ప్ర‌తి రోజు రెజ్ల‌ర్లు కొత్త డిమాండ్ చేస్తున్నార‌ని బ్రిజ్ భూష‌ణ్ విమర్శించారు. ముందుగా ఎఫ్ఐఆర్ డిమాండ్ చేశార‌ని, ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాక‌, ఇప్పుడు త‌న‌ను జైలుకు పంపాలంటున్నార‌ని, అన్ని పోస్టుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల వ‌ల్ల తాను ఎంపీని అయ్యాన‌ని, వినోశ్ పోగ‌ట్ వ‌ల్ల తానేమీ ఎంపీని కాలేద‌ని గుర్తు చేశారు. ఒక అకాడ‌మీకి చెందిన ఒక కుటుంబం నిర‌స‌న‌లు చేప‌డుతోంద‌న విమర్శించారు. హ‌ర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు త‌న‌తోనే ఉన్నార‌ని స్పష్టం చేశారు.