శ్రీరామ నవమి హింసాకాండలో మమత పాత్రపై దర్యాప్తు జరగాలి

శ్రీరామ నవమి సందర్భంగా గత నెలలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాకాండలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ పాత్రపై దర్యాప్తు జరపాలని విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. ఈ హింసాకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపించేందుకు కలకత్తా హైకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలను ఆయన స్వాగతించారు.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, హుగ్లీలలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా కొద్ది రోజులపాటు హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ హింసాకాండపై ఎన్ఐఏ చేత దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఈ దాడులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు స్పష్టమవుతోందని వీహెచ్‌పీ ఆరోపించింది.

వీహెచ్‌పీ నేత సురేంద్ర జైన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా గత నెలలో శిబ్ పూర్, రిష్రాలలో జరిగిన దాడులను ముఖ్యమంత్రి మమత బెనర్జీ రెచ్చగొట్టినట్లు తెలుస్తోందని తెలిపారు. ఈ హింసాకాండలో ఆమెతోపాటు టీఎంసీ పాత్రపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ దాడులు ఏదో ఒక చర్యకు ప్రతిస్పందనగా జరిగినవి కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయని హైకోర్టు ఆదేశాలనుబట్టి స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యకు తక్కువేమీ కాదని ధ్వజమెత్తారు.  హింసాకాండపై విస్తృత స్థాయిలో దర్యాప్తు జరపగలిగేది ఎన్ఐఏ మాత్రమేనని పేర్కొన్నారు.

అల్లర్లకు పాల్పడేవారి చేతిలో కీలుబొమ్మగా బెంగాల్ పోలీసులు మారిపోయారని ఆయన దుయ్యబట్టారు. ఈ హింసాత్మక సంఘటనలకు పాల్పడినవారు ఎవరైనప్పటికీ, వారిని రెచ్చగొట్టినది మాత్రం మమత బెనర్జీయేననే అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో ఆమెతోపాటు, ఆమె నేతృత్వంలోని పార్టీ టీఎంసీ పాత్రపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.