నేటి నుండి కర్ణాటకలో ప్రధాని ఆరు రోజుల సుడిగాలి ప్రచారం

నేటి నుంచి 6 రోజుల పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనబోతున్నారు. సుడిగాలి పర్యటనల్లో భాగంగా ఆయన 22 ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. బహుశా ఇప్పటివరకు ఆయన ఉత్తర ప్రదేశ్ తో సహా ఏ రాష్ట్రంలో కూడా ఇంత విస్తృతంగా ప్రచారంలో పాల్గొనలేదు.  శనివారం ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లనున్న మోదీ హుమ్నాబాద్, విజయపుర, కుడాచి, బెంగళూరు, ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తారు. బెంగళూరులో ఇవాళ 5 కిలోమీటర్ల రోడ్ షో చేయబోతున్నారు.
 
ఇక ఏప్రిల్ 30న కోలార్, చెన్నపట్న, బెలూర్‌లో రోడ్ షో చేస్తారు. తిరిగి ఢిల్లీ వెళ్లి మే 2న మళ్లీ కర్ణాటక వస్తారు. 2, 3న ప్రచారం చేసి, మళ్లీ ఢిల్లీ వెళ్లి తిరిగి మే 6, 7 కర్ణాటకలో ప్రచారం చేస్తారు. ఎన్నిక ఏదైనా దాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకొని ప్రచారం చేయడం బిజెపి చేస్తూ వస్తున్నది.  ఇక పార్టీ అధికారంలో ఉన్న చోట అసెంబ్లీ ఎన్నికలు రావడం, దక్షిణాదిన అధికారంలోకి వచ్చిన తొలి రాష్ట్రం కావడంతో ఎట్లాగైనా గెలుపొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది.
పైగా, గత నాలుగు దశాబ్దాలుగా అధికార పార్టీ గెలుపొందిన వరవడి లేని కర్ణాటకలో నూతన చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మే 8 వరకే గడువు ఉంది. అంటే ఇవాళ్టి నుంచి 10 రోజులు మాత్రమే. మే 10న ఎన్నికలు, 13న ఫలితాల ప్రకటన ఉంటుంది. అందువల్ల ఈ 10 రోజుల్లో జోరుగా ప్రచారం చేస్తే ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లినట్లు అవుతుందని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. 
స్వయంగా ప్రధానితోనే ప్రచారం చేయించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఎదురయ్యే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పలు ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ కు సానుకూలంగా నివేదికలను విడుదల చేస్తున్నా బిజెపి గెలుపు పట్ల భరోసాతో తనదైన ప్రణాళికతో ప్రచారంలో నిమగ్నమై ఉంది.  ఇప్పటికే బీజేపీ తరపున అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు ప్రచారం చేశారు.
ఇదివరకు మోదీ ప్రచారం చేసిన చాలా రాష్ట్రాల్లో బీజేపీకి కలిసొచ్చింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తరపున ప్రచారం చేసిన మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, తిరిగి భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించారు. ఇప్పుడు కర్ణాటకలోనూ బసవరాజ్ బొమ్మై తరపున ప్రచారం చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని మరోసారి తెరపైకి తేవాలనుకుంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ వస్ రివర్స్ గేర్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కన్నడ నాడి ఎలా ఉంటుంది అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకూ కలిపి మొత్తం 2,613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్క అధికార బీజేపీ మాత్రమే 224 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, జేడీఎస్ నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది పోటీ పడుతున్నారు.  బీఎస్పీ నుంచి 133 మంది, జెడియు నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిపిఐ నుంచి నలుగురు పోటీ పడుతుండగా,  స్వతంత్రులు 918 మంది ఉన్నారు.