కేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి

రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందని, దళిత బంధులో ప్రజాప్రతినిధులు రూ.  3 లక్షల నుంచి 5 లక్షల వరకు  తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆరే చెప్పారని పేర్కొంటూ దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆయన కోరారు.

హైకోర్టు సుమోటోగా తీసుకుని సీఎం కేసీఆర్ కు  నోటీసులివ్వాలని ఆయన సూచించారు.  దళితబంధులో అవినీతికి పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోకుండా,  తప్పు చేస్తున్న  మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ వెనకేస్తున్నారని రఘునందన్ రావు విమర్శించారు. దళితబంధులో జరుగుతోన్న అవినీతిపై  సీఎం కేసీఆర్  హైకోర్టుకు లేఖ రాయాలని లేకపోతే ఏసీబీ డీజీకి అవినీతి చిట్టా వివరాలివ్వాలని స్పష్టం చేశారు.

ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలని ఆయన పేర్కొన్నారు. దళితబంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తప్పు చేసిన మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మందలించాల్సిందిపోయి, సీఎం కేసీఆర్ వెనకేసు కొస్తున్నారని విమర్శించారు.

సొంత ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? వారిపై సీబీఐ దర్యాప్తు చేయించే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోని   కేసీఆర్ కు ముఖ్యమంత్రి  సీటులో కూర్చునే అర్హత లేదని బిజెపి ఎమ్యెల్యే విమర్శించారు.

ఊర్లలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని రఘునందన్ రావు ఆరోపించారు.  తప్పు చేస్తే తనయుడైనా, తనయ అయినా శిక్షిస్తానన్న కేసీఆర్ ఇవాళ ఒక సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించరో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉపముఖ్యమంత్రి రాజయ్యపై  ఎలాంటి ఆరోపణలు రుజువు చేయకుండానే  క్యాబినెట్ నుంచి ఎలా తొలగించారో, బీసీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలా తొలగించారో, మంత్రి నిరంజన్ రెడ్డిపై  అదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక మంత్రిపై అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే  కేసీఆర్ ఎందుకు స్పందించరని రఘునందన్ రావు ప్రశ్నించారు.

ధరణిలో లోపాలున్నాయని రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తప్పుబట్టినా మార్పులు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం పేద రైతుల భూములను అప్పనంగా అమ్ముకుంటుందని ఆరోపించారు. డబుల్ బెడ్రూంలో అవినీతి, ధరణిలో అవినీతి,  మిషన్ కాకతీయలో అవినీతి, దళితబంధులోనూ.. ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలో  దోపిడి జరుగుతోందనని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

ఎమ్యెల్యేలపై చర్యలు తీసుకోరే?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందని చెప్తున్న కేసీఆర్ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని షర్మిల ప్రశ్నించారు.

ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని… ఆ అనామకుడికున్న విలువ కేసీఆర్ కు లేదా అని నిలదీశారు.  లిక్కర్ స్కాంలో నీ  బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే కదా..ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కండ్లు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా చూస్తున్నావ్ అని కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.