రష్యాకు ఎగుమతులకై సందేహిస్తున్న భారతీయ కంపెనీలు

ఉక్రెయిన్‌తో ఏడాదికి పైగా పోరు సాగిస్తూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న రష్యాలో ఇప్పుడు పలు విధాలుగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. పలు పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలను విధించడంతో రష్యాకు వాహనాలకు సంబంధించిన ముడిభాగాల సరఫరా గణనీయంగా తగ్గింది. పైగా, కొన్ని రకాల ఆహార వస్తువుల కొరత కూడా ఏర్పడింది.

రష్యా ఎక్కువగా పశ్చిమ దేశాలపై ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడుతోంది. అయితే అక్కడి నుంచి ఇప్పుడు సరఫరాలు లేకపోవడంతో కార్లు, వాహనాల విడిభాగాలు, తమదేశంలో దొరకని ఆహార పదార్థాలపై కూడా ఇప్పుడు రష్యా ఎక్కువగా భారతదేశం వైపు ఆశతో చూస్తోందని వెల్లడైంది. అయితే భారతీయ వ్యాపార వర్గాలు వెనువెంటనే రష్యాకు ఎగుమతులకై సంశయిస్తున్నారు.

రష్యాకు ఎగుమతులు చేస్తే తాము ఎక్కువగా ఆధార పడుతున్న ఐరోపా, అమెరికా మార్కెటులలో ఇబ్బందులు ఏర్పడగలవని వెనకడుగు వేస్తున్నారు. అంతర్జాతీయంగా తమకున్న డాలర్ మారక రేటు, రష్యాకు సరఫరా చేస్తే తమ కంపెనీలపై ఇతర దేశాల నుంచి పడే వేటు వంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నాయి. తమకు నిర్ణీత రూపీ రూబ్‌ల్ మారక రేటు అవసరం అని స్పష్టం చేస్తున్నారు.

భారతదేశం నుంచే ఎక్కువగా వివిధ రకాల సరుకులు తెచ్చుకోవాలని రష్యా ఇటీవలి కాలంలో తపిస్తోంది. దేశంలోకి ముడిభాగాల సరఫరా లేకపోవడంతో అవసరానికి తగ్గట్లుగా కార్ల తయారీ లేదు. దీనితో భారత్ నుంచి కార్లను, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితిలో రష్యా ఉంది.

భారతదేశానికి రష్యా ఇప్పుడు చవక ధరకు క్రూడాయిల్ విక్రయించడం, అంతర్జాతీయ వేదికలపై రష్యాకు వ్యతిరేక తీర్మానాల దశలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం వంటి పరిణామాలు ఇరుదేశాల లోపాయికారి ప్రస్తుత మిత్రత్వాన్ని తెలియచేస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని భారతీయ బ్యాంకులు, కంపెనీలు రష్యాతో లావాదేవీలకు దూరంగా ఉంటున్నాయి.

రష్యాలో ఇప్పుడు వాహనవినియోగదార్లు తమ వాహనాలకు అవసరం అయిన స్పేర్‌పార్టులు దొరకకపోవడంతో తమ కార్లను ఇతర వాహనాలను మూలకు పెట్టాల్సి వస్తోంది. కాలినడక ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి. లేదా ప్రజా సామూహిక రవాణాలకు దిగుతున్నారు.  భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు రష్యా నుంచి ఇప్పుడు విపరీత డిమాండ్ ఆర్డర్లు వస్తున్నా, పశ్చిమ దేశాలలోని తమ భారీ మార్కెట్‌ను కాదని రష్యాలో ప్రవేశించేందుకు సిద్ధంగా లేవని తెలిసింది.

మరోవంక, సోయా ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు కోసం భారత్ వైపు చూస్తోంది. రష్యాలోని పలు ప్రముఖ సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు సరుకులు లేక వెలవెలపోతున్నాయి. చివరికి ఎయిర్‌పోర్టుల వంటి చోట్ల ఉండే సుంకాల రహిత షాప్‌లలో ఇప్పుడు రష్యా వోడ్కా తప్ప మరో సరుకు దొరకడం లేదని రష్యాలో పర్యటించి వచ్చిన వారు చెబుతున్నారు.