సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులుపైనే చైనాతో సంబంధాలు

ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనడంపైనే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, వాగ్దానాలకు అనుగుణంగా వాస్తవాధీన రేఖ వెంబడి సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలని చెప్పారని తెలిపింది.

భారత్, చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జనరల్ లీ షాంగ్ఫు గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2020లో గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఇటువంటి ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

 వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న అన్ని సమస్యలను ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. ఇప్పటికే ఉన్న ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికను క్షీణింపజేసిందని వెల్లడించారు. దీని వల్ల సరిహద్దుల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ఎస్‌సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 27, 28 తేదీల్లో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని తెలిపింది. పరస్పర ప్రయోజనాలుగల అంశాలు, రక్షణ సంబంధిత సమస్యలపై చర్చిస్తారని తెలిపింది.

జనరల్ లీ షాంగ్ఫు ఎస్‌సీఓ సమావేశంలో ఏప్రిల్ 28న పాల్గొంటారు. ఈ సమావేశానికి ముందు లీ, రాజ్‌నాథ్ సమావేశం జరిగింది. ఇరు దేశాల సరిహద్దుల్లో పరిణామాలు, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ప్రస్తుత ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లనే ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని  రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దళాల ఉపసంహరణతోనే ఉద్రిక్తతలు తగ్గుతాయని తేల్చి చెప్పారు. 

ఇదిలావుండగా, భారత్, చైనా 18వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ మీటింగ్ ఆదివారం చైనా వైపునగల చూసుల్-మోల్డో సరిహద్దులో జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమ సెక్టర్‌లో క్షేత్ర స్థాయిలో భద్రత, సుస్థిరతలను కొనసాగించాలని ఇరు దేశాల కమాండర్లు అంగీకరించారు.

న్యూఢిల్లీలో శుక్రవారం జరిగే ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో చైనా, కిర్గిజ్‌స్థాన్, కజక్‌స్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొంటారు.

కాగా, వచ్చే వారం మే 5, 6 తేదీలలో గోవాలో జరిగే ఎస్‌సీఓ సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి కీన్ గ్యాంగ్ కూడా భారత్ లో పర్యటింపనున్నారు. ఇలా ఉండగా, కజకిస్థాన్‌, ఇరాన్‌, తజికిస్థాన్‌ రక్షణ మంత్రులతో కూడా రాజ్‌నాథ్ సింగ్ వేర్వేరుగా సమావేశాలు జరిపారు.