ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నయ్

“కేసీఆర్.. ఒక్కసారైనా రైతుల వద్దకు రా. యాడ చూసినా పంట నష్టపోయి రైతులు ఏడుస్తున్నరు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నయ్. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలి.” అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
 
కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన గ్రామాల్లో సోమవారం పర్యటించి కన్నీటి పర్యంతమైన రైతులను ఓదార్చి భరోసా ఇచ్చారు. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా? అంటూ ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్టయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కదా అని పేర్కొన్నారు.
 
ఆయా కేంద్రాలు తెరవకపోవడం వల్లే కోతలను చాలా మంది రైతులు నిలిపివేశారని చెప్పారు. ప్రకృతి విపత్తుల కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమైనాయని అంటూ వాటిని వేటికి ఖర్చు చేశారో వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
 
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్‌తో కలిసి కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పకీర్ పేట, చామనపల్లి, వేదురుగట్ట గ్రామాల్లో బండి సంజయ్ పర్యటించారు. వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానతో రైతులు పూర్తిగా పంట నష్టపోయారని సంజయ్ తెలిపారు.  పోయినసారి పంట నష్టపోయారు. ఈసారైనా పంట చేతికొస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుని అప్పు తీర్చాలని రైతులు తపన పడ్డారు. తీరా చూస్తే మళ్లీ వడగండ్ల వానతో పంట పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫసల్ బీమా పరిహారం అమలు చేస్తే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదని సంజయ్ చెప్పారు. కేసీఆర్ వల్ల రైతులు బిచ్చగాళ్ల లెక్క ప్రతిసారి అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. వారంలో ఇస్తాననన్న పంట నష్టపరిహారం ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని  ప్రశ్నించారు.