మంత్రి నిరంజన్ రెడ్డికి చైనా వ్యక్తితో లావాదేవీలు!

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భూ అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఎం రఘనందన్ రావు ప్రకటించారు.
మంత్రి నిరంజన్ రెడ్డి తరచూ చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మాట్లాడుతున్నారని చెబుతూ ఈ విదేశీ లావాదేవీలపై కూడా ఈడీ విచారణ కోరుతామని స్పష్టం చేశారు.
 
మంత్రి తన పాత నెంబర్ నుంచి తరచుగా చైనాకు కాల్స్ వెళ్లాయని చెబుతూ చైనాకు చెందిన ఓ వ్యక్తితో అర్ధిక లావాదేవీలు జరిగాయని వాటిని కూడా బయటపెట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. చైనాకు చెందిన ‘మో’తో మంత్రికి సంబంధం ఏమిటి?. అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారు?. అని ప్రశ్నించారు.
 
నిరంజన్‌ రెడ్డిపై తాను నిర్దిష్టంగా ఆరోపణలు చేశానని, అవేమి గాలి మాటలు కాదని చెబుతూ సర్వే నెం. 65 మినహా మంత్రి ఏ ఒక్క అంశంపై సమాధానం ఇవ్వలేదని తెలిపారు. 1973-74 పహాణీల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెబుతూ ఆర్డీఎస్‌ భూముల్ని మంత్రి తన క్షేత్రాల్లో కలపుకున్నామని ఆరోపించారు.
 
 మంత్రి నిజం ఒప్పుకోవాలని, సర్వే నంబర్ 60లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎంతో లెక్క తేల్చాలని రఘునందన్ డిమాండ్ చేశారు. భూముల అవకతవకల మీద మాత్రమే తాను విమర్శలు చేశానని స్పష్టం చేశారు.

కబ్జాలకు పాల్పడకపోతే మంత్రి దగ్గరున్న ఆధారాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే నిలదీశారు. విదేశాల్లో ఉన్న వారు భూములు ఎలా కొనుగోలు చేశారని, ఆ సమాచారం ఆర్బీఐకు తెలియ చేశారా? అని ప్రశ్నించారు. కృష్ణా నది భూములు కబ్జాకు గురయ్యాయని తాను ఆరోపించానని, అవి నిజం కాకపోతే సర్వేకు ఎందుకు మంత్రి ముందుకు రావట్లేదని అడిగారు.

పహాణీలలో ఉన్న పత్రాలను తాను బయటపెట్టానని, తన దగ్గర ఉన్న పత్రాలు తప్పుడు పత్రాలైతే అసలు పత్రాలను మంత్రి బయట పెట్టాలని సవాలు చేశారు. రైతులు అడిగితే ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైందని చెబుతున్నారని, వాస్తవాలను చెప్పకుండా సంబంధం లేని విషయాలు మంత్రి మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.

ఎన్నారైలుగా ఉన్న వారు వ్యవసాయ భూములు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. మంత్రి కుమార్తెలు చిన్న వయసులోనే ఆస్ట్రేలియా వెళ్లిపోయారని, వారికి ఇక్కడ భూములు ఎలా వచ్చాయని నిలదీశారు. మంత్రి భూ కబ్జాల భాగోతంపై ఈడీ విచారణ కోసం ఆశ్రయిస్తానని, దర్యాప్తు తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.

గిరిజనుడిని అడ్డు పట్టుకొని మంత్రి పొందిన సబ్బీడీలు ఎన్ని అని రఘునందన్ ప్రశ్నించారు. ప్రజలను మంత్రి నిరంజన్ రెడ్డి మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు మంత్రి కొనుగోలు చూసిన భూముల లెక్కలు చూపించడం లేదంటనే మంత్రి తప్పు చేసినట్లు అని రఘునందన్ రావు ఆరోపించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో ఓ గిరిజన బిడ్డను తన దత్తపుత్రుడిగా చెప్పుకున్నట్లు ఆరోపణలు వినిపించాయని చెబుతూ ఆ దత్తపుత్రుడి పేరుపై కాంట్రాక్ట్ పనులు చేయించారని ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కొన్న భూముల వివరాలు ఎందుకు రికార్డుల్లో చూపించలేదని ప్రశ్నించారు.