గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసును ముగించిన సుప్రీం కోర్టు

తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ ముగించింది. వివరణ కోసం గవర్నర్ కు  బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందన్న సుప్రీంకోర్టు  వీలైనంత త్వరగా బిల్లులపై  నిర్ణయాలు తీసుకోవాలని  సూచించింది.  ప్రస్తుతానికి బిల్లులు పెండింగ్ లో లేనందున ఈ కేసును ముగిస్తున్నట్లు తెలిపింది. 

విచారణ సందర్భంగా గవర్నర్ దగ్గర  ఎటువంటి  బిల్లులు పెండింగ్ లో లేవని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. రెండు బిల్లుల విషయంలో  ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. అయితే  గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు.

ప్రభుత్వం పంపించిన బిల్లులను వెంటనే తిప్పిపంపించే అవకాశం గవర్నర్లకు ఉందని., కానీ  తమ దగ్గరే పెండింగ్‌లో పెట్టుకోవటం సరికాదని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బిల్లులు త్వరగా పరిష్కారం అవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.

  ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రస్తుతం బిల్లులు పెండింగ్ లో లేనందున  కేసు విచారణను ముగిస్తున్నామని చెప్పింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం గవర్నర్లు వీలైనంత తొందరగా బిల్లులకు ఆమోదం తెలపాలని సూచించారు. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వీలైనంత త్వరగా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.