పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల, విజయమ్మ

ఇంటి నుండి బైటకు వెడుతున్న తనను అడ్డుకున్న పోలీసులపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెచ్చిపోయారు. మరోవంక అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన తన కుమార్తెను చూసేందుకు అనుమతిపలేదని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. తమను అడ్డుకొంటున్న పోలీసులపై వీరిద్దరూ చేయి చేయిచేసుకోవడం కలకలం రేపుతోంది.
 
షర్మిల కారులో బయటకు వెళుతుండగా షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వైఎస్ షర్మిల పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. రోడ్డు మీద నుంచి లేమని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు.
 
అనంతరం పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు.  ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. ఆ తర్వాత షర్మిల ముందుకు వెళ్లకుండా అడ్డుగా నిలబడిన మరో ఎస్సైను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. షర్మిలను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె వారితో వాగ్వాదానికి దిగారు.
షర్మిలను కారు ఎక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ కానిస్టేబుల్ చెంపపై కొట్టి, ఏమనుకుంటున్నావని హెచ్చరించారు.  ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆందోళనకు దిగిన షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలతో తన గన్ మెన్ ను కూడా వెళ్లకుండా పోలీసులు ఆపేశారు.

వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్‌ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్‌ షర్మిల కారును ఆపేందుకు యత్నిస్తుండగా, కానిస్టేబుల్‌ గిరిబాబుపై కారును ఎక్కించారు. దానితో కారు ఎక్కించడంతో గాయపడ్డ గిరిబాబును స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్‌ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ”తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. నన్ను ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో చెప్పాలి. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్తున్నా.. అడ్డుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భయపడుతున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొందాలా. కెసిఆర్‌కు నిజాయితీ ఉంటే పేపర్ లీకేజ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి” అని డిమాండ్ చేశారు.

ఇంకోవైపు,  వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్‌కు వైఎస్ విజయమ్మ వెళ్లారు. షర్మిలను కలిసేందుకు విజయమ్మ పీఎస్‌ లోపలికి వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. తన కూతురిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.

వైఎస్ విజయమ్మను కారులో నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. దీంతో తన కూతురిని చూడటానికి ఎందుకు అనుమతించరంటూ పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. వాదిస్తున్న ఓ మహిళా అధికారిని కొట్టారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని విజయమ్మ తెలిపారు.