
పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు బిల్లులను వెనుకకు పంపారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్ ఏజ్‌ను 61 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ తిరస్కరించారు.
మరో రెండు బిల్లులు- పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లుపై వివరణ కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు. పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంత కాలం ఉన్న మూడేళ్ళ గడువును నాలుగేళ్ళకు పెంచుతూ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకొచ్చింది.
దీనిపై నిర్ణయం తీసుకునేముందు మరింత వివరణ అవసరమని గవర్నర్ తమిళసై అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లుపై సైతం నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం నుంచి వివరణ కావాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము పంపిన బిల్లులను గవర్నర్ అమోదించకుండా తన వద్దే ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) సునిత కుమారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సోమవారం రోజున దీనిపై విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెడింగ్ బిల్లులు లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. మొత్తం 10 బిల్లుల్లో 3 బిల్లులను గవర్నర్ గతంలోనే ఆమోదించగా మరో 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మిగిలిన 5 బిల్లుల్లో 4 బిల్లులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి పంపించగా మరో బిల్లును సోమవారం తిరస్కరించారు.
More Stories
అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు
పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు చేయగలరా?
కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి