రేవంత్ రెడ్డికి నాకు పోలిక ఏంటి?

రేవంత్ రెడ్డికి, తనకు పోలిక ఏంటి? అని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్యెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారని పేర్కొంటూ ప్రజల కోసం పోరాడి ఆయన జైలుకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. తాను విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నానని గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు తుపాకి పట్టుకొని వచ్చింది రేవంత్ కాదా?
 
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 25 కోట్లు ఇచ్చిందన్న విషయంలో తాను రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదంటూ ఈటెల స్పష్టం చేశారు. ఇప్పటివరకు తాను ఏ రాజకీయ నాయకుడి గురించి అసభ్యకరంగా మాట్లాడలేదని, ఏ రాజకీయ నేత గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
 
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరిగాయని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుకు సంబంధించి కాంగ్రెస్ నేతల కంటే బీఆర్ఎస్ నేతలకే ఎక్కువగా బాధపడ్డారని ఆరోపించారు. రెండు పార్టీల పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సంకేతాలు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాలేనన్న బాధతోనే రేవంత్ రెడ్డి కన్నీరు కార్చారేమో అంటూ ఈటల ఎద్దేవా చేశారు.
 
 “రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ సంస్కరహీనంగా మాట్లాడిండు. విద్యార్థి దశ నుంచే నేను పోరాడుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో నేను పోరాడుతున్నప్పుడు… రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర ఉన్నాడు. ప్రజల కోసం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లలేదు. ఓటుకు నోటుకు కేసులో వెళ్లిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి” అని తెలిపారు.
 
రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెడతారని అనుకోలేదని అంటూ ధీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టరని హితవు చెప్పారు. “ఏదైనా ఉంటే రాజకీయంగా గచూసుకుందాం. దమ్ముందా.. తేల్చుకుందాంరా..! నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో రండి” అంటూ రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు ఈటల. ఆర్టీఐ పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ఓ ఆఫీస్‌నే పెట్టుకున్న చరిత్ర నీది అంటూ ఎదురు దాడి చేశారు.