సూడాన్‌లో భారతీయుల పరిస్థితిపై ప్రధాని సమీక్ష!

సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లో జరుగుతున్న హింసాకాండలో  చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్న తీరుపై చర్చించారు. దక్షిణాఫ్రికా దేశమైన సూడాన్‌లో గత వారం రోజులుగా అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ దళం మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో సూడాన్ అమాయక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు 350 మందికిపైగా ప్రజలు  మృత్యువాత పడగా, 2500 మంది క్షతగాత్రులుగా మారారు. సుడాన్‌లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, ఇండియాలో సూడాన్ రాయబారి బీఎస్ ముబారక్, ఈజిప్టు, రియాద్ రాయబారులు, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్, కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ (కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా అండ్ ఓవర్సీస్ ఇండియన్ ఎఫైర్స్) డాక్టర్ ఎ.సయూద్ తదితరులు పాల్గొన్నారు.

సూడన్‌‌లో సైన్యం, పాలమిటరీల బలగాల మధ్య ఘర్షణలో సంఖ్యాపరంగా ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారనే దానిపై ఇంకా అస్పష్టత ఉంది. ఘర్షణలు పెరుగుతుండటంతో వేలాది మంది పౌరులు సూడాన్ రాజధాని ఖార్తూమ్ విడిచిపెట్టి వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఏప్రిల్ 20న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గెటెరెస్‌తో సమావేశమై సూడాన్‌లోని పరిస్థితులపై చర్చించారు.

తమ మధ్య సూడాన్ పరిస్థితిపై అర్ధవంతమైన చర్చ జరిగిందని, జీ-20, ఉక్రెయిన్‌లో ఘర్షణలు కూడా చర్చించామని, అయితే ప్రధానంగా సూడాన్‌పై చర్చ జరిపామని జైశంకర్ తెలిపారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులతో ఢిల్లీలోని తమ బృందం ఎప్పడికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.

సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో చాలా మంది భారతీయులు కూడా చిక్కుకున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఓ భారతీయుడు మరణించినట్లుగా తెలుస్తోంది.  తాజాగా 300కి పైగా భారతీయులు అక్కడ చిక్కకుపోయారు. ఓ వైపు బాంబుల మోత, మరోవైపు సైనిక దాడులు, ఇటు సూడాన్‌ ఆర్మీ.. అటు పారామిలటరీ దళాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలతో సూడాన్‌లో యుద్ధవాతావరణం ప్రజలకు భయకంపితులను చేస్తోంది.
సూడాన్‌ పౌర ఘర్షణల్లో కర్నాటకకు చెందిన 31 మంది ఆదివాసీలు అక్కడ చిక్కుకుపోయారు.  భారతీయులెవ్వరూ బయటకు రావొద్దంటూ ఇండియన్‌ ఎంబసీ పిలుపుమేరకు వారంతా ఓ ఇంట్లోనే ఉండిపోయారు. చుట్టూ హింసాత్మక ఘటనలు చెలరేగుతుండడంతో బయటకు వచ్చే దారిలేక, తిండీ నీళ్ళులేక అల్లాడిపోతున్నట్లుగా సమాచారం.
 
రాజధాని ఖార్టూమ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఫైటింగ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఎంబసీ తెరిచే ఉందని, పని చేస్తున్నదని పేర్కొంది. అయితే ఖార్టూమ్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న ఇండియన్‌ ఎంబసీ బిల్డింగ్‌ సమీపంలో ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య భారీస్థాయిలో పోరాటం జరుగుతున్నదని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో భారతీయ రాయబార కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని, వారంతా ఇళ్ల నుంచి పని చేస్తున్నారని తెలిపింది. దీంతో రక్షణ, లేదా సహాయం కోసం భారతీయులు ఇండియన్‌ ఎంబసీ వద్దకు వెళ్లవద్దని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సుడాన్‌లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితి చక్కబడే వరకు ఎక్కడికీ వెళ్లడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకారం, సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయారు. దీంతో సూడాన్‌లో 150 ఏళ్లుగా నివసిస్తున్న వారు 1200 మంది ఉన్నారు.