బ్రిటన్ పాఠశాలల్లో పెరుగుతున్న హిందూ ద్వేషం!

బ్రిటన్ లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ద్వేషం బాగా పెరుగుతూ ఉండడంతో భారత సంతతి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ వ్యతిరేక భావజాలానికి భారతీయ విద్యార్థులు బాధితులుగా మారినట్టు, వారు వివక్షతకు గురవుతున్నట్లు ‘హెన్రీ జాక్సన్ సొసైటీ’ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో స్పష్టమైంది.
 
షార్లెట్ టిల్‌వుడ్ అనే పీహెచ్‌డీ విద్యార్థిని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. మొత్తం 988 మంది హిందూ విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.  హిందూమతంపై వ్యతిరేకత కారణంగా తమ పిల్లలు పాఠశాలల్లోలో వివక్ష ఎదుర్కొన్నట్టు సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తల్లిదండ్రులు తెలియజేశారు.
 
 హిందూ మత విద్య విషయంలో కూడా హిందూ విద్యార్థులు మతపరంగా వివక్షకు గురవుతున్నారని అధ్యయనంలో పాల్గొన్న కొందరు చెప్పారు. అలాగే ఈ నివేదికలో హిందువులను ఇస్లాంలోకి మార్చమని వేధించడంతో సహా వివిధ సంఘటనలు ప్రస్తావించడం జరిగింది. తమకు ఏ ఇబ్బంది ఎదురు కాలేదని కేవలం ఒక శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.
 
ఇక 19 శాతం మంది హిందూ తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ వ్యతిరేక ద్వేషాన్ని గుర్తించగలవని నమ్ముతున్నారు. 15 శాతం మంది హిందూ తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ-వ్యతిరేక సంఘటనలను తగినంతగా పరిష్కరిస్తాయని భావిస్తున్నట్లు రిపోర్ట్‌ పేర్కొంది.  బ్రిటన్‌లో హిందువులపై వివక్ష విస్తృతంగా ఉన్నప్పటికీ కేవలం1 శాతం పాఠశాలల్లోనే ఫిర్యాదులు నమోదైనట్టు సర్వేలో తేలిసింది.

 అంతేకాకుండా హిందువులపై వివక్షను పాఠశాలలను గుర్తించలేక పోతున్నాయని 81 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్ పాఠశాలల్లో 16 సంవత్సరాల వయస్సు వరకు మతపరమైన విద్య అనేది తప్పనిసరి. అయితే, స్కూళ్లలో హిందూ పిల్లలు బహుళ దేవుళ్లను ఆరాధించడం వల్ల వారిని ఎగతాళి చేస్తున్నారని కొందరు తల్లితండ్రులు చెప్పినట్టుగా నివేదిక వెల్లడించింది.

“400 ఏళ్ళ పాటు భారత్ ను బ్రిటిష్ వారు పరిపాలించినా, ఇక్కడున్న మత విశ్వాసాల గురించి బ్రిటిష్ ప్రజలలో అవగాహన లేకపోవడంతో వారు మా దేవతల గురించి, సంప్రదాయాల గురించి అర్థం చేసుకోలేరు. దానితో మా పిల్లలు పాఠశాలల్లో వేధింపులకు గురవుతున్నారు” అంటూ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  మతపరంగా శాఖాహారం మాత్రమే తీసుకొనే హిందూ విద్యార్థులు ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. ఒక విద్యార్ధి హిందూ బాలికపై ఆవుమాంసంను గిరవాటు వేసిన ఘటనను ఈ నివేదికలో పొందుపరిచారు.
పలువురు దేవుళ్లను ఆరాధించడాన్ని, గోవును పూజించడాన్ని ‘కఫిర్లు’గా ముస్లిం విద్యార్థులు వారిని హేళన చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హిందూ విద్యార్థులు ఇలాంటి వేధింపులను కొన్నేళ్ల పాటు భరించాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేక తూర్పు లండన్‌కు చెందిన ఓ విద్యార్థి ఒకే ఏడాదిలో ఏకంగా మూడు పాఠశాలలు మారాల్సి వచ్చినట్టు కూడా ఈ నివేదిక ద్వారా తెలిసింది. వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న 22 ఏళ్ల లోపు భారతీయ విద్యా్ర్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్టు తేలింది.
కాగా, హిందూ మతం గురించి బ్రిటన్ పాఠశాలల్లో చాలా చావుకబారుగా బోధిస్తున్నారని, ఇంకా అరేబియా దృష్టికోణంతోనే చూస్తూ బోధిస్తున్నారని తల్లితండ్రులు పేర్కొంటున్నారు. కుల వ్యవస్థను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందూమతం గురించి బోధిస్తూ ఉండడంతో హిందూ విద్యార్థులు అవహేళనకు గురవుతున్నట్లు వాపోతున్నారు. గతేడాది ఆగస్టు చివరలో దుబాయిలో జరిగిన ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో లీసెస్టర్‌లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండను విశ్లేషించిన సమయంలో పాఠశాలలపై తాను దృష్టి సారించినట్టుగా నివేదిక రచయిత షార్లెట్ లిటిల్‌వుడ్ పేర్కొన్నారు.