పాలస్తీనా సమస్యపై మధ్యవర్తిత్వంకు చైనా సిద్ధం

అరబ్‌ ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉన్న సౌదీ, అరేబియా మధ్య సయోధ్య కుదర్చడంలో సఫలమైన చైనా, తాజాగా పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపడంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది.
 
చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ ఇజ్రాయిలీ, పాలస్తీనా విదేశాంగ మంత్రులతో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడుతూ దశాబ్దం తరువాత రెండు దేశాల మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించేలా చూసేందుకు చైనా తన వంతు తోడ్పాటునందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ విషయమై చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
 
ఇజ్రాయిల్‌, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ, ఇరాన్‌ మధ్య 2016లో తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించడంలో చైనా గత నెలలో నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించింది.  దీంతో ఇరాన్‌, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు పునరుద్ధరించబడడమే కాదు, ఈ రెండు దేశాలతో ముడిపడి వున్న యెమెన్‌ యుద్ధానికి కూడా తెర దించి, శాంతిని నెలకొల్పేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. అదే సమయంలో అరబ్‌ ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి కూడా బ్రేక్‌ పడినట్లైంది.
 
ఇప్పుడు పాలస్తీనియన్లకు, ఇజ్రాయిలీయులకు మధ్య శాంతి చర్చలు ఫలించి, పాలస్తీనా సమస్య పరిష్కారమైతే యావత్‌ పశ్చిమాసియాలో అమెరికా పెత్తనానికి నూకలు చెల్లినట్టేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.