భారత్ లో పర్యటించనున్న పాక్ మంత్రి భుట్టో

దాదాపు 12 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ కు చెందిన ఒక కీలక మంత్రి భారత్ లో పర్యటించనున్నారు. మే 4 వ తేదీన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్ కు వస్తున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడం కోసం ఆయన భారత్ కు వస్తున్నారు.

భారత్ లో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గనేందుకు రావాలని పాకిస్తాన్, చైనా సహా ఎస్సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు భారత్ అధికారికంగా ఆహ్వానం పంపించింది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కు గత సెప్టెంబర్ లో భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది.

ఈ కూటమిలో మొత్తం 9 సభ్య దేశాలున్నాయి. అవి చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాలు. మే 4, 5 తేదీల్లో గోవాలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సు జరుగుతుంది.

ఆ సదస్సుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరు కానున్నారు. 2011లో హినా రబ్బానీ ఖేర్ పాక్ విదేశాంగ మంత్రి హోదాలో భారత్ లో పర్యటించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత పాకిస్తాన్ మంత్రి ఒకరు భారత్ లో పర్యటించడం ఇదే కాగలదు. 2014లో చివ‌రి సారి అప్ప‌టి ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌ధాని మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం కోసం భారత్ లో పర్యటించారు.

భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆహ్వానం మేరకు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సుకు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్లో హాజరువుతున్నారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా గురువారం ఉదయం ప్రకటించారు. తాము ఆ సదస్సుకు హాజ‌రుకావ‌డం ఎస్సీవో ప‌ట్ల పాక్ క‌ట్టుబ‌డి ఉంద‌న్న సంకేతాన్ని ఇస్తుంద‌ని ఆయనతెలిపారు. పాక్ త‌మ విదేశాంగ విధానంలో ఎస్సీవో మీటింగ్ ప్రాధాన‌త్య ఇస్తుంద‌ని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు.