మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్  గడల శ్రీనివాస్‌‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..ఆ తర్వాత వరుసగా వివాదాల్లో నిలుస్తూ వస్తున్నారు.  తాజాగా తాయత్తు వల్లే తాను బతికానని, డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని చెప్పి వివాదంలో చిక్కుకున్నారు.  కొత్తగూడెంలో ముస్లింలకు ఆయన తన జీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన ముస్లింలతో ఆయన కలిసి నమాజ్ చేసి, తర్వాత మాట్లాడుతూ తన బాల్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారని చెప్పారు. అప్పుడు తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని,  ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు.

‘‘నేను పుట్టిన టైమ్‌‌లో అనారోగ్యానికి గురయ్యాను. చావు బతుకుల మధ్య ఉన్నాను. ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు నాకు తాయత్తు కట్టించారు. ఆ తాయత్తు మహిమతోనే నేను ఇప్పుడు ఈ స్థా యిలో ఉన్నా”అని ఆయన తెలిపారు.

కొత్తగూడెంలో కొత్తగా ఈద్గాలు, కబరస్థాన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మందికి రంజాన్ తోఫాలు పంపిణీ చేశారని తెలిపారు. రంజాన్ నెలలో మసీదులకు డబ్బులు ఇస్తున్నారని, అయితే అవి సరిపోవడం లేదని, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు. మరో కొత్తగూడెనికి సమయం ఆసన్నమైందని, ముస్లింలంతా తనతో కలిసి రావాలని కోరారు.
 
దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.  ఖురాన్ ఒక గొప్ప గ్రంధమని, ఇప్పటికి తెలుగులో ఉన్న ఖురాన్ ను నేను పటిస్తూ ఉంటానని పేర్కొన్నారు. జీసస్ వల్లే కరోనా పోయిందంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలనే చేయడం ఫై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే డీహెచ్ గ‌తంలో క్షుద్ర‌పూజ‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో డీహెచ్ మూఢ న‌మ్మ‌కాల‌ను పెంచి పోషిస్తున్న‌ట్లు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించి కూడా వివాదాస్పదమయ్యారు.