ఈద్గా ప్రార్థనల కోసం అటవీ భూమి .. బండి అభ్యంతరం

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములలో ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ 543, 544, 969 లోని అటవీ భూమిని వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలనే  రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు 3.373 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపిందని ఆయన సీఎం కేసీఆర్ కు వ్రాసిన లేఖలో గుర్తు చేశారు.

అటవీ భూమిని  డీనోటిఫై చేసి కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే  ఆ  భూమిని కేసీఆర్​ స్వార్ధ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్దమని ఆయన విమర్శించారు.  ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

గతంలో వెలువరించిన  కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలోని అటవీ భూముల్లో ఈద్గాను నిర్మించడం న్యాయ వ్యవస్థను అవమానించినట్లేనని ఆయన ధ్వజమెత్తారు.  ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడిన అటవీ భూములను కేసీఆర్​ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం నీచమైన  చర్యని ఆయన మండిపడ్డారు. 

నిరుద్యోగ యువత కోసం కేటాయించిన భూమిని ప్రార్థనా స్థలాలకు కేటాయించడం ఒక పొరపాటు అయితే, ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం స్వయంగా పూనుకోవడం క్షమించరాని నేరమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్​ స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

ఆ భూములను ఈద్గా నిర్మాణానికి కేటాయించడం, దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  మహమూద్ అలీ ఆ నిర్మాణ పనులను స్వయంగా ప్రారంభించేందుకు మంగళవారం  ఆ ప్రాంతానికి వెళుతుండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వృత్తి విద్య, నైపుణ్యం అభివృద్ధి కోసం కేటాయించబడిన భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని  సంజయ్​  డిమాండ్​ చేశారు.

దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని  ఆశ్రయించడంతోపాటు ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  ప్రజాక్షేత్రంలోనూ మీ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని కేసీఆర్ ను హెచ్చరించారు.