అవినాష్ రెడ్డికి 25 వరకు అరెస్ట్ నుండి హైకోర్టులో ఊరట

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25 వరకు అరెస్ట్ నుండి ఊరట లభించింది.  25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు సిబిఐ విచారణకు హాజరు కావాలని అవినాష్‌ రెడ్డికి సూచించింది.
 
సిబిఐ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది. భాస్కర్‌ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ దాకలు చేసిన పిటిషన్‌ వారం రోజుల పాటు 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని స్పష్టమైంది. ఈ క్రమంలో సిబిఐ ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు విచారణకు కావాలని ఆదేశించింది. సిబిఐ రోజూ విచారణకు పిలిచినా హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది.

రిమాండ్‌ రిపోర్ట్‌లలో ఎక్కడ వివేకా హత్యకు ప్రధాన కారణం సిబిఐ తెలియ చేయకపోవడంతోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. గతంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులలో వివేకానంద రెడ్డి హత్యకు కారణాలను వివరించకపోవడంతో అవినాష్ బెయిల్‌ పిటిషన్ అనుమతించినట్లు తెలుస్తోంది.

 25వ తేదీన ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. 25వ తేదీన జరిగే వాదనల ఆధారంగా తుది తీర్పు వెలువరించనుంది. సిబిఐ విచారణ సందర్భంగా సిబిఐ ప్రశ్నావళిని అవినాష్‌కు అందచేయాల్సి ఉంటుంది. దానిని వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దని సిబిఐ తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అవినాష్ రెడ్డి ఎప్పుడు సిబిఐ విచారణకు సహకరించ లేదని సిబిఐ తరపు న్యాయవాది అనిల్‌కుమార్‌ కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించామని, వివేకా హత్యలో అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు ఉన్నాయని, సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించినట్లు సీబీఐ వివరించింది.

వివేకా హత్యకు దాదాపు రూ. 40 కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించామని కోర్టుకు తెలిపారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. వైఎస్ వివేకా తలకు బ్యాండేజ్ వేసి సహజ మరణంగా చిత్రికరించారని, గుండె పోటుగా ప్రచారం చేయడంలో అవినాష్‌ కీలక పాత్ర పోషించారని సిబిఐ ఆరోపించింది.

ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సునీత అవినాష్ బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హత్య జరిగిన తర్వాత ముందుగా అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి ఘటనా స్థలికి వచ్చారని సునీత తరపు న్యాయవాదులు ఆరోపించారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడనే కాన్సెప్ట్ వీళ్లే రచించారని ఆరోపించారు.

మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్టైన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిలను ఆరు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అనుమతించారు. ఈ నెల 24వ తేదీ వరకు నిందితులను సిబిఐ కస్టడీకి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది.