జాతీయవాద జర్నలిస్ట్ కృష్ణ వర్మ మృతి

కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీనియర్ జాతీయవాద జర్నలిస్ట్ దండు కృష్ణ వర్మ (73) శుక్రవారం చికిత్స పొందుతూ విజయవాడలో మృతి చెందారు. మే 20, 1950న జన్మించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  విజయవాడలో స్వయంసేవక్ గా పలు జాతీయవాద  ఉద్యమాలలో, కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేశారు. ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. పలు జాతీయవాద సంస్థలలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
 
కేంద్ర ప్రభుత్వ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియాలో ఉద్యోగిగా చెన్నైలో జీవనం ప్రారంభించిన ఆయన తొలి నుండి జర్నలిజం పట్ల ఆసక్తి చూపుతుండేవారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని అప్పుడే కొత్తగా ప్రారంభించిన ఇండియా టుడేలో చేరారు.  అయితే అక్కడ ఎడిటర్ మారడంతో కొనసాగలేక కొన్ని ఇతర ఉద్యోగాలు చేసి, హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చాలాకాలం మీడియా ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు.
 
అనేక పత్రికలకు సంపాదక సహకారం అందించేవారు. అనేక పత్రికలలో వ్యాసాలు, కధనాలు వ్రాసేవారు.  అనేకమంది జర్నలిస్టులు, సామజిక సేవారంగాలలో పనిచేస్తున్న ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. జాతీయవాద అంశాలపై నిరంతరం తపన చెందుతుండేవారు.
 
కృష్ణవర్మ మృతి పట్ల బిజెపి రాష్త్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రగాఢ సంతాపము తెలిపారు. జాతీయవాద భావాలు మెండుగా ఉన్న కృష్ణవర్మ ఏ పనిచేసినా ఎంతో నిబద్దత కనబరిచేవారని ఆయన కొనియాడారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తనవంతు బాధ్యతలను నెరవేర్చేవారని తెలిపారు.