ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్

దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 
ఆదివారం ఉదయం పులివెందులలో ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
 
పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ఉంట్లో ఉండే మిగతా వారిని బయటకు పంపి సుమారు గంటన్నర పాటు సిబిఐ అవినాష్ ఇంట్లోనే భాస్కర్ రెడ్డిని విచారించినట్లు సమాచారం. విచారణ అనంతరం మెమో జారీ చేసి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను సిబిఐ ఇంటి నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడే బయట ఉన్నవారు ఒక్కసారిగా గేటు వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డు తొలగించి భాస్కర్ రెడ్డిని వాహనంలోతీససికెళ్ళారు.
అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచనున్నారు. భాస్కర్రెడ్డి అరెస్ట్ మెమోను ఆయన భార్య లక్ష్మీకి అందజేశారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
 వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసి ప్రశ్నించింది. ఈ పరిణామం పులివెందులలో కలకలం రేపుతోంది. వివేక హత్య కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారిది ఒక అంశం అయితే ముఖ్యులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎంపి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వైయస్ కుటుంబంలోనూ కలకలం రేగుతుంది.
 

వివేకా హత్య కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు సీబీఐ తేల్చింది. దీంతో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ కేసులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను అధికారులు ప్రస్తావించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని సీబీఐ పేర్కొంది.

సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించిన విషయాలు.. ‘‘హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్ళాడు. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్‌లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలింది. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారు. అవినాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటాడు”.