విశాఖ బీడ్ కు గడువు కోరిన తెలంగాణ

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని, ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థలనుండి ఆ కంపెనీ ఆహ్వానించినా బీడ్ లో పాల్గొంటామని ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వ నేతలు బీడ్ కు గడువు ఆదివారం పూర్తయినా అటువైపు చూడలేదు.  తెలంగాణ సర్కార్ తరఫున బిడ్ వేస్తామని మంత్రులు మాట్లాడిన మాటలన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయి. అయితే బీడ్ దాఖలు చేయడానికి మరో ఐదు రోజులు గడువు కోరారు.
 
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు చెందిన అధికారుల్ని అక్కడికి పంపి పరిశీలించిన తర్వాత ఓ నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేసిన తర్వాత కూడా మిన్నకుండిపోయారు. ముడిపదార్థాల సరఫరా, నిర్వహణ మూలధనం సాయం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)కోరుతూ ఈ బిడ్లను విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఆహ్వానించిన బీడ్ కు గడువు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది.
 
ఈ క్రమంలో బిడ్‌ దాఖలుకు తమకు ఐదు రోజులు గడువు కావాలని ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యాన్ని సింగరేణి కాలరీస్‌ కోరింది. ఆ మేరకు ఈ నెల 20 వరకు గడువు ఇచ్చారు. ఇది అందరికీ వర్తింపజేస్తున్నట్టు ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి పదార్థాలు, ఆర్థిక సాయం అందించడానికి మొత్తం 22 సంస్థలు బిడ్లు వేశాయి.  మరిన్ని కంపెనీలు బిడ్‌లో పాల్గొంటాయనే సమాచారంతో గడువు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడయినా తెలంగాణ ప్రభుత్వం నుండి బీడ్ దాఖలు చేస్తారో లేదో చూడవలసి ఉంది.
 
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఈ బిడ్డింగ్ లో పాల్గొన్నారు. క్రౌండ్ ఫండింగ్ నిధులు సేకరిస్తామని లక్ష్మీ నారాయణ ప్రకటించారు. ఇందులో ఏం చేయలగమో అనేది ఆలోచిస్తామని, స్టీల్‌ప్లాంట్‌ను బిడ్డలాగా చూసుకోవాలనే బిడ్ వేసినట్లు తెలిపారు.  క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని  చెప్పారు.
 
 నెలకు రూ. 850 కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని లక్ష్మీనారాయణ ప్రకటించారు. తెలుగు ప్రజలు ఒక్కొక్కరు రూ.200 చొప్పున ఇస్తే చాలని ఆయన చెప్పారు. అందులో భాగంగా తొలి మొత్తంగా రూ. 200 విరాళాల సేకరణ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలి…ఆ ఉద్దేశంతోనే వర్కింగ్ క్యాపిటల్ బిడ్డింగ్ లో పాల్గొన్నానని జేడీ తెలిపారు.