తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండడంతో శనివారం ఈసీ బృందం హైదరాబాద్లో పర్యటించింది.  డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ నేతృత్వంలోని ఈసీ బృందం  తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ వికాస్‌రాజ్‌, ఇతర అధికారులతో సమావేశమైంది.

ఎన్నికల కసరత్తుపై  రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది.  రాష్ట్రంలో  ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై ఈసీ బృందం సమీక్షించింది.  లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండాలని అధికారులను ఆదేశించింది. తెలుస్తోంది. ఓటర్ల జాబితాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఫుల్‌ప్రూఫ్ జాబితా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.

రిటర్నింగ్‌ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. జూన్‌ 1 నుంచి ఈవీఎంల  మొదటి దశ తనిఖీ చేపట్టాలని అధికారులు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈవీఎంలను పరీక్షించి అన్ని జిల్లాలకు పంపామని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. అధికారులకు శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని సూచించింది.  పోలింగ్‌ శాతం పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల బృందం ఆదేశించింది.

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి.  తన పదవీ కాలం పూర్తయ్యే 9 నెలల ముందు (సెప్టెంబరు 6 2018న) సీఎం కేసీఆర్‌ రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో సాధారణ ఎన్నికలకంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.

కాగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ సూచించారు. రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించినప్పుడు బందోబస్తు ఓ పరీక్షలాంటిందని, ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను సరికొత్త వ్యూహంతో పరిష్కరించాలని పేర్కొన్నారు. ఇందులో స్పెషల్‌ బ్రాంచ్‌ల పనితీరు అత్యంత కీలకమని చెప్పారు.