సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర

ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదని పేర్కొంటూ  సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని చె సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్పారు. మధ్యవర్తిత్వం వల్ల ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుంతుందని హైదరాబాద్‌ ఐఏఎంసీలో జరుగుతున్న ఇండియా మీడియేషన్‌ డే కార్యక్రమంలో పాల్గొంటూ తెలిపారు.

ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్‌లోనూ పెరిగిందని చెబుతూ  మీడియేషన్‌ బిల్లు రాకవల్ల మధ్యవర్తిత్వం ప్రాధాన్యం మరింత పెరిగిందని వెల్లడించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ వేగవంతంగా, విశ్వసనీయతతో సాగాలని,  ఉభయపక్షాలకు ఉపయోగకరంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ సాగాలని సూచించారు. మధ్యవర్తిత్వంలోనూ కృత్రిమ మేథను భాగం చేస్తున్నారని తెలిపారు.

న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌ హిమ కోహ్లి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం మధ్యవర్తిత్వం ప్రధాన పాత్ర వహిస్తుందని పేర్కొంటూ చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేదని చెప్పారు. ఆధునిక కాలంలో కొందరు మీడియేషన్‌ను మెడిటేషన్‌గా కూడా పొరబడుతున్నారని తెలిపారు.

మధ్యవర్తులు పరిష్కారం కోసం పార్టీలను ఒత్తిడి చేయరని, సమస్య పరిష్కారం కోసం తగిన వాతావరణం ఏర్పాటు చేస్తారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మూడు రకాల మధ్యవర్తిత్వాలు ఉన్నాయని, వాటిలో కోర్ట్‌ రిఫర్‌ మీడియేషన్‌, ప్రైవేటు మీడియేషన్‌ ముఖ్యమైనవని చెప్పారు.

హైదరాబాద్‌లోని మీడియేషన్‌ కేంద్రం చూసి ఆశ్చర్యపోయానని జస్టిస్‌ రవీంద్రన్‌ తెలిపారు. మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ గురించి చాలామందికి ఇంకా తెలియదని వెల్లడించారు. కోర్టు వివాదాల వల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అవుతాయని పేర్కొంటూ మధ్యవర్తిత్వం ద్వారా వందల కోట్లతో ముడిపడిన సమస్యలు కూడా రోజుల్లోనే పరిష్కారం కావచ్చని తెలిపారు.