అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఖాళీ పోస్టుల భర్తీపై తొలి సంతకం

‘‘ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా… బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.‌
 
 శనివారం సాయంత్రం ఓరుగల్లులో వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన మార్చ్ లో వేలాది మంది నిరుద్యోగులు, కార్యకర్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి సంజయ్ ప్రసంగిస్తూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల, ఆయా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
 
కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నేతలను కాపాడుకునేందుకే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు.
సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. లీకేజీ కేసులో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాటాన్ని ఆపేది లేదని ప్రకటించారు. 
 
అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించి నేటికీ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయని దుర్మార్గపు సర్కార్ కేసీఆర్ దని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా 75 వేల ఉద్యోగాలను ఏ పొరపాటు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు చేతగావడం లేదు? అని ప్రశ్నించారు.
 

ఈ నిరుద్యోగ మార్చ్ ఇంతటితో ఆగదని అంటూ ఈనెల 21న పాలమూరు గడ్డమీద నిర్వహిస్తామని, ఆ తరువాత అన్ని ఉమ్మడి జిల్లాలన్నింట్లోనూ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. “నిరుద్యోగులారా నిరాశ పడకుండి. బీజేపీ అండగా ఉంది. మాకు నేషన్ ఫస్ట్… ఫ్యామిలీ లాస్ట్… తెలంగాణలో యువత మాకు ఫస్ట్.. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది” అంటూ భరోసా ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ను తలపిస్తున్న నిరుద్యోగ మార్చ్ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. కేసీఆర్ ఫ్రభుత్వ పతనానికి నిరుద్యోగ మార్చ్ నాంది పలుకుతోందని స్పష్టం చేస్తూ ఓరగల్లు నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో కొత్త చరిత్ర స్రుష్టించబోతోందని తెలిపారు.

 
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని భరోసా వ్యక్తం చేస్తూ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని వెల్లడించారు.  జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికిపాటి మోహన్ రావు, మాజీ ఎంపీలు చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు.