44 ఏళ్ల నేర సామ్రాజ్యాన్ని 48 రోజుల్లో కూల్చేసిన యోగి సర్కారు

మాఫియాను మట్టిలో కలిపేస్తానని ఉత్తర ప్రదేశ్ శాసన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మాటను నిలబెట్టుకుంటున్నారు. మాఫియా డాన్, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అతిక్ అహ్మద్ కు చెందిన  44 ఏళ్ళ ఆర్థిక సామ్రాజ్యాన్ని, అతని ముఠాను 48 రోజుల్లో కుప్పకూల్చారు. ఆయన నేరాలు చేయడం ద్వారా ఈ ఆస్తులను సంపాదించినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
 

అతిఖ్ అహ్మద్, అతడి అనుచరులకు చెందిన రూ.1400 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. ఈ ఆస్తులన్నీ నేరాల ద్వారా సంపాదించినవేనని పోలీసులు తెలిపారు. ఈడీ కూడా రంగంలోకి దిగి రూ.100 కోట్లకుపైగా ఆస్తులు, 50 డొల్ల కంపెనీల గుట్టును బయటపెట్టింది. ఈ డొల్ల కంపెనీలను ఉపయోగించుకొని అతిఖ్ నేరాలు చేసి సంపాదించిన నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకునేవాడని తెలుస్తోంది.

అతిఖ్ అహ్మద్‌తోపాటు అతడి సోదరుడు అష్రఫ్‌ జైలులో ఉంటూనే వైద్య పరీక్షలకు బైటకు వచ్చిన్నప్పుడు దారుణ హత్యకు గురయ్యారు.  అతడి ఇద్దరు కుమారులు జైల్లో ఉండగా, అతడి మూడో కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. అయితే, ఇద్దరు మైనర్ కుమారులు జువైనల్ హోంలో ఉండగా,  అతడి భార్య షైస్టా పర్వీన్ పరారీలో ఉంది.

 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 15 బృందాలుగా వెళ్లి అతిక్, ఆయన గ్యాంగ్ ఆస్తులను గుర్తించారు. దాదాపు రూ.1,400 కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని జప్తు చేశారు. మనీలాండరింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు.

 అతిఖ్ ముఖ్య అనుచరులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. ఓ న్యాయవాది, అకౌంటెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే, బిల్డర్, కార్ షోరూం యజమాని కూడా అతిక్‌కు సహకరిస్తున్నట్లు తెలుసుకుని, వారిని దర్యాప్తు కోసం పిలిచారు.

అతిఖ్ అహ్మద్ మొదట్లో గ్యాంగ్ స్టర్, అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతడు1989 నుంచి 2004 వరకు అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆ తర్వాత లోక్ సభకు ఎన్నికయ్యాడు. అతిఖ్ అహ్మద్‌పై వందకుపైగా కేసులు ఉన్నప్పటికీ 2017 ప్రారంభానికి ముందు వరకూ అతడు బెయిల్ తెచ్చుకొని బయట తిరిగేవాడు.

 
1979లో అంటే 44 ఏళ్ల క్రితం అతడిపై తొలిసారి కేసు నమోదైంది. కానీ గత ప్రభుత్వాలు అతడ్ని ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేల్చలేకపోయాయి. సాక్షులు అదృశ్యమవడం కానీ, ప్రతికూలంగా మారడం కానీ జరుగుతూ ఉండేది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉమేశ్ పాల్ అపహరణ కేసులో బలమైన వాదనలు వినిపించింది. దీంతో తొలిసారి అతిఖ్ అహ్మద్‌కు గత నెలలో జీవిత ఖైదు పడింది.
 
2005 జనవరి 5న ప్రయాగ్‌రాజ్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్, అతడి అనుచరులపై దాడి చేసి హతమార్చారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న లాయర్ ఉమేష్ పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే హత్యకు గురయ్యాడు. అతిఖ్, అతడి భార్య పర్వీన్, అతడి కుమారుడు అసద్ తదితరులు ఈ హత్య చేశారని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
 
ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ మాట నెరవేరింది. దీంతో పొలిటిషీయన్ కమ్ గ్యాంగ్‌స్టర్ అయిన అతిఖ్ అహ్మద్ సామాజ్ర్యం కుప్పకూలింది. ఈ హత్య సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డయ్యింది. అతిఖ్ కుమారుడు అసద్ సహా ఐదుగుర్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగానే అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.