బెంగాల్ లో 35 ఎంపీ సీట్లు ఇస్తే మమతా ప్రభుత్వం కూలిపోతుంది

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి 42 సీట్లకుగాను 35 సీట్లు కట్టబెట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఈ లక్ష్యాన్ని బీజేపీ సాధిస్తే  తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండదని, 2025 లోపుగానే కూలిపోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
దీదీ సర్కారుకు 2026 మే వరకు గడువుంది. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పశ్చిమబెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. బెంగాల్ లోని బీర్బుమ్‌ జిల్లాలో అమిత్‌ షా పర్యతీస్తూ రాష్ట్రంలో పలుచోట్ల శ్రీరామ నవమి ర్యాలీల్లో ఘర్షణలు తలెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ హిట్లర్‌ తరహా పాలనను నడుపుతున్నారని మండిపడ్డారు.
 
లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 35 సీట్లకు పైగా సాధించి కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే శ్రీరామనవమి ర్యాలీలపై ఎవరూ దాడిచేసే సాహసం చేయరని స్పష్టం చేశారు.  ప్రస్తుతం ఎంపీగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ముఖ్యమంత్రిని చేయాలని దీదీ కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
 
 కానీ బెంగాల్‌కు తర్వాత అయ్యే ముఖ్యమంత్రి బీజేపీ నుంచే అవుతారని అమిత్ షా స్పష్టం చేశారు. అవినీతి తృణమూల్‌పై పోరాడేది, ఓడించేది ఒక్క బీజేపీ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 18 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.