కర్ణాటకలో కాంగ్రెస్ కు శరద్ పవర్ షాక్!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌, మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చారు. మే నెలలో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయాలని నిర్ణయించారు. సుమారు 40 నుంచి 45 స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది.
 
జాతీయ పార్టీ హోదాను కోల్పోవడంతో పాటు గోవా, మణిపూర్, మేఘాలయలలో ‘రాష్ట్ర పార్టీ’ హోదాను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జాతీయ,రాష్ట్ర పార్టీ హోదాను దక్కించుకునేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఈసీ తమకు అలారమ్‌ సింబల్‌ను కేటాయించినట్లు చెప్పారు.
 
మరోవైపు వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం ప్రయత్నాలలో భాగంగా గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీతో శరద్‌ పవార్‌ సమావేశమయ్యారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలన్న అంశంపై వారితో చర్చించారు.
 
ఇది  24 గంటల్లోనే ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ-కాంగ్రెస్-జేడియూ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొన్న తరుణంలో ఎన్సీపీ ప్రవేశించడం కాంగ్రెస్ కె ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

కాగా, మరాఠీ జనాభా అధికంగా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది. అలాగే మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నది. ఎన్సీపీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్‌ ఓట్లను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఎన్సీపీ ఓట్లు చీలిస్తే బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉందంటుని పరిశీలకులు భావిస్తున్నారు.

అదానీ వ్యవహారంలో జేపీసీ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను తప్పుబట్టి ఇప్పటికే  ప్రతిపక్షాలపై శరద్‌ పవార్‌ పెద్ద బాంబే పేల్చారు. దానితో ఐక్యతా యత్నాలు మళ్లీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని కాంగ్రెస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో నితీష్ కుమార్ ను ముందుకు తెచ్చారు. ఈ లోగా మరోసారి పవర్ కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం కలకలం రేపుతోంది.

సావర్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వాఖ్యలపై సహితం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మహారాష్ట్ర మనోభావాలను దెబ్బతీసే అటువంటి వాఖ్యలు చేయవద్దని అంటూ సున్నితంగా మందలించారు.