ఈశాన్యంను నిర్లక్ష్యం చేసిన ప్రతిపక్షాలు

ఈశాన్య ప్రాంతాన్ని ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. “గత ప్రభుత్వాలకు ఈశాన్య ప్రాంతం ‘దూరంగా’ ఉండేది. దాన్ని ‘దగ్గర’కు తీసుకురావడానికి మేం అంకితభావంతో పనిచేశాం. గత 9 ఏండ్లుగా ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేశాం” అని తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాలలో నిర్మించిన మొట్టమొదటి ఎయిమ్స్‌‌ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభింభిస్తూ ఈశాన్య ప్రాంతాన్ని జాతీయ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి తమ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మేము ప్రజల కోసం ‘సేవాభావం”,  ‘సమర్పన్’తో పని చేస్తున్నామని చెప్పారు.

గత తొమ్మిదేళ్లుగా ఈశాన్య ప్రాంతంలో సామాజిక మౌలిక సదుపాయాలను నాటకీయంగా మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో సామాజిక మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెబుతూ ఈ ప్రాంతంలో విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ ప్రజలకు అద్భుతంగా జరిగిందని వివరించారు.

అభివృద్ధి పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకునేందుకునే ప్రజలు ముందుకు రావడం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగడం సంతోషంగా ఉందని మోదీ కొనియాడారు. ఈ కొత్త ప్రగతి విప్లవంలో, కేంద్ర ప్రభుత్వం ఒక స్నేహితుడు, సేవకుడు  లాగా పనిచేస్తోందని, ఈ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.

కుటుంబ నియంత్రిత రాజకీయాలు, ప్రాంతీయవాదం, అవినీతి, అభద్రతాభావంతో దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతం నష్టపోయిందని, దీనివల్ల అభివృద్ధి సాధ్యం కాలేదని, అందుకు ఆ ప్రాంతం భారీ మూల్యాన్ని చెల్లించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈశాన్యం వంటి మారుమూల ప్రాంతాల్లో ‘జస్టిస్ డెలివరీ సిస్టమ్‌‌’లో వేగం పెంచేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ 1.1 కోట్ల ఆయుష్మాన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. రాబోయే ఒకటిన్నర నెలల్లో ఈ సంఖ్య 3.3 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఈ కార్డులతో లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయల వరకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ వైద్య చికిత్స ప్రయోజనాలను పొందగలుగుతారని తెలిపారు.

గౌహతిలో రూ.1,123 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్‌‌కు 2017లో ప్రధాని శంకుస్థాపన చేశారు. ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ అస్సాంలో అభివృద్ధి ఘనత తమకు రావడం లేదని ప్రతిపక్షాలు ఆవేదన చెందుతున్నాయని పరోక్షంగా విమర్శించారు.

రూ.546 కోట్లతో నిర్మించనున్న అస్సాం అడ్వాన్స్‌‌డ్‌‌ హెల్త్‌‌కేర్ ఇన్నోవేషన్ ఇన్‌‌స్టిట్యూట్ కూ ప్రధాని శంకుస్థాపన చేశారు. 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. నల్బరి, నాగావ్, కోక్రాజర్‌‌‌‌ మెడికల్ కాలేజీలను వర్చువల్‌‌గా లాంచ్ చేశారు. గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లోనూ మోదీ మాట్లాడారు.