బిజెపి అభ్యర్థి నుండి కుమారస్వామికి తీవ్ర పోటీ

కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని ఎదురు చూస్తున్న జెడిఎస్ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చన్నపట్న నియోజకవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగారు.  ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నా,  ప్రధానంగా బిజెపి నాయకుడు సి.పి.యోగేశ్వరతో బలమైన పోటీ ఎదురవుతున్నది.

యోగేశ్వర 1999లో ఆ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ సీటు నుంచి 2004, 2008  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. తదుపరి యోగేశ్వర బిజెపిలో చేరారు. 2009లో జరిగిన ఉప ఎన్నికలో జెడిఎస్ అభ్యర్థి అశ్వత్ ఎం.సి చేతిలో ఓడిపోయారు. కానీ 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఆ సీటును తిరిగి గెలుచుకున్నారు.

తర్వాత ఆయన 2013లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి) అభ్యర్థిగా పోటీచేసి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామిని ఓడించి ఆ సీటును గెలుచుకున్నారు. ఆయనకి 80,099 ఓట్లు రాగా, అనితకు 73,635 ఓట్లు వచ్చాయి. తిరిగి 2018 ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా కుమారస్వామిపై ఓటమి చెందారు.

యోగేశ్వరను ఓడించి, అతడి రాజకీయ కెరీర్‌ను ఖతం చేయడానికి ఇప్పుడు కుమారస్వామి చన్నపట్న నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఇక కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి పొరుగునే ఉన్న రామ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. చన్నపట్న నియోజకవర్గంలో నగరానికి చెందిన 31 వార్డులు ఉన్నాయి.