పోలీసులకు చిక్కిన అమృత్‌పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు

ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ డే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు జోగా సింగ్ను  పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ అమృత్‌సర్, హోషియార్‌పూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా జోగా సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌పాల్ జోగా మార్చి 18 నుంచి 28 వరకు కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అమృత్ పాల్ సింగ్ పిలిభిత్ లో తలదాచుకోవడానికి అనుచరుడు జోగా సింగ్ సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.  అమృత్ పాల్ సింగ్ తో నేరుగా సంబంధాలు క‌లిగివుంటూ అతనికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు వాహనాలు జోగా సింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమృత్ పాల్ ను మార్చి 27న జోగాసింగ్  పంజాబ్ కు తీసుకొచ్చారని అమృత్ సర్ రూరల్ ఎస్ఎస్పీ సతీందర్ సింగ్ తెలిపారు.

లుధియానాకు చెందిన జోగా సింగ్ ఉత్తరప్రదేశ్ లోని ఫిలిభిత్ లోని డేరాకు ఇన్ చార్జ్ గా వ్యవహరించాడని చెప్పారు  అమృత్ పాల్ సింగ్ తో జోగా సింగ్ కు ప్రత్యక్ష సంబంధాలున్నాయని, అమృత్ పాల్ సింగ్ కు ఆశ్రయం క‌ల్పించ‌డంతో పాటు వాహనాలు ఏర్పాటు చేశాడని వివరించారు.  పిలిభిత్ లో ఉండి, అమృత్ పాల్ సింగ్  పంజాబ్ కు తిరిగి వచ్చేలా జోగా సింగ్ ఏర్పాట్లు చేశాడని తెలిపారు. 

వారిస్ డే పంజాబ్ కార్యకర్తలపై పంజాబ్ పోలీసులు మార్చిలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించారు.  మార్చి 18న అమృత్‌పాల్ సింగ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అయితే అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ తన రూపాన్ని తరచూ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

అటు అమృత్ పాల్ సింగ్ కు ఆశ్రయం కల్పిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏప్రిల్ 14వ తేదీన పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారు హోషియార్ పూర్ జిల్లా బాబక్ గ్రామానికి చెందిన రాజ్ దీప్ సింగ్., జలంధర్ జిల్లాకు చెందిన సరబ్ జిత్ సింగ్ గా గుర్తించారు. వీరిద్దరినీ డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరచగా… ఒక రోజు పోలీస్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.