
రెండు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలకు గురువారం సాయంత్రం సమయంలో మబ్బులు కమ్మేయగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి కాస్త ఉపశమనం దొరికినట్లు అయింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్, బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, మీర్ పేట్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో గాలితో కూడుకున్న భారీ వర్షం కురిసింది. దిల్ షుఖ్ నగర్,మలక్ పేట, చైతన్య పురి, కొత్తపేట తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది.
ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతున్నాయి. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి.
ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామాల్లో వరి చేన్లు, మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక, తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 15, 16వ తేదీల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా తేదీల్లో మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది.
More Stories
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం