
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు అరెస్టులు, విచారణ చేపడుతున్న సిట్ తాజాగా మనీ లాండరింగ్ విషయమై దర్యాప్తుకు రంగంలోకి వచ్చిన ఈడీకి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు సిట్ విముఖత చూపుతుంది.
మొదటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ ని వివరాలు ఇవ్వాలని కోరినా సిట్ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ మార్చి 23న సిట్ కు లేఖ రాసింది.
అయితే ఇప్పటివరకు కూడా సిట్ తమకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని ఈడీ ఆరోపిస్తుంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించింది. తమకు అవసరమైన వివరాలు ఇచ్చేలా సిట్ కు ఆదేశాలివ్వాలని ఈడీ ఆ పిటిషన్ లో పేర్కొంది. అయితే ఈడీ పిటీషన్ పై సిట్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ కోర్టుకు తెలిపింది.
అయితే, ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ ఆ నివేదికను ఇటీవల తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు. పేపర్ లీక్, నిందితుల అరెస్ట్ ఆ తరువాత జరిగిన పరిణామాలన్నింటిని కూడా సిట్ అధికారులు ఈ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు..ఈ పేపర్ లీకేజిలో ప్రవీణ్, రాజశేఖర్ లది కీలక పాత్ర ఉందని సిట్ అధికారులు గుర్తించారు
ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన దగ్గరి నుండి ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేయగా..15 మందిని కస్టడీకి తీసుకొని పలు కీలక విషయాలు రాబట్టారు. అలాగే మరో 450 మందిని సిట్ అధికారులు విచారించారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకరలక్ష్మీ ఈడీ ఎదుట హాజరయ్యారు. సెక్షన్ 50 ప్రకారం శంకర్ లక్ష్మీ వాగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. శంకరలక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో.. ప్రవీణ్, రాజశేఖర్‌లకు పేపర్లు ఎలా చేరాయనే వివరాలను ఈడీ ఆరా తీసింది.
టీఎస్పీఎస్సీ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడీ భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని గుర్తించింది.ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది.
More Stories
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రవేశం
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి