దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహాన్నిఆవిష్కరించిన కేసీఆర్

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనువడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ వద్ద  బీఆర్ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహన్ని అవిష్కరించారు. హెలికాప్టర్‌ ద్వారా అంబేడ్కర్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో బౌద్ధ గురువులు పాల్గొన్నారు. బీఆర్‌ అంబేడ్కర్ జీవిత విశేషాల ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.
 
అట్టహాసంగా జరిగిన ఆవిష్కరణోత్సవం అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ  అంబేద్కర్ విశ్వమానవుడని,  అణగారిన వర్గాలకు ఆశాదీపమని కొనియాడారు. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజ‌నీన‌మైన‌దని, ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి ప‌రిమితమైంది కాదని స్పష్టం చేశారు.
 
 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అంబేద్కర్ అని ప్రశంసించారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ప్రతి రోజు స‌చివాల‌యానికి వ‌చ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్‌ను చూస్తూ వారు ప్రభావితం కావాలని సూచించారు. ఆయ‌న సిద్ధాంతం, ఆచ‌ర‌ణ క‌ళ్లలో మెద‌లాల‌నే ఈ విధంగా రూప‌క‌ల్పన చేసినట్టు తెలిపారు.
 
ఇది విగ్రహం కాదు.. విప్లవమని తెలిపారు. ఇది ఆకారానికి ప్రతీక కాదు, తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక అంటూ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి రోజున ప్రతి ఏడాది అవార్డులను ఇస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంబేద్కర్ అవార్డుల కోసం రూ. 51 కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పారు.
డిపాజిట్ తో వచ్చే రూ.3 కోట్ల డబ్బులతో ఆవార్డులు ఇస్తామని తెలిపారు. ఏటా అంబేద్కర్ జయంతి  సందర్భంగా రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించే వారికి ఈ అవార్డలు ఇస్తామని చెప్పారు.
 
కాగా, రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్ఎస్‌దే అధికారమని సీఎం కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఊహించని విధంగా స్పందన వస్తోందని తెలిపారు. ముందు ముందు అన్ని రాష్ట్రాల్లో ఇదే స్పందన కన్పిస్తుందని తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే 50 వేల మందికి దళితబంధు ఇచ్చామని.. ఈ ఏడాదిలో మరో 25 వేల మందికి దళితబంధు అందించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.