ఇఎస్‌ఐ ఆసుపత్రుల నుంచి తప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం

కార్మికులకు, చిరుద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్యారోగ్య సేవలు అందించే కార్మిక బీమా సంస్థ (ఇఎస్‌ఐ) ఆసుపత్రుల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభమే అందుకు కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇఎస్‌ఐ ఆస్పత్రుల నిర్వహణ ఇక ఇఎస్‌ఐ కార్పొరేషనే చూసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది.

ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో ఇఎస్‌ఐకి కేంద్రంగా వున్న గుణదల ఆస్పత్రితోపాటు, కర్నూలులోని నిర్మించనున్న ఆస్పత్రికి బాధ్యతను కూడా దానికే అప్పగించింది. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇఎస్‌ఐలోని కార్పొరేషన్‌ ద్వారా నిర్వహించే ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతలను మామూలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి.

వైద్యుల నియామకాలు, ఇతర ఉద్యోగుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది. మందులకు సంబంధించి కార్పొరేషన్‌ ఇచ్చే నిధులకు కొంత రాష్ట్రం జోడిస్తుంది. ఇఎస్‌ఐ సౌకర్యం ఉన్న కార్మికులు పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పుడు ఇస్‌ఐ సెలవులు ఇస్తుంది. ఆ సెలవుల కాలంలో కొంత జీతాన్నిస్తుంది.

కర్నూలులో 30 పడకల ఆస్పత్రిని నిర్మించేందుకు ఇఎస్‌ఐ కార్పొరేషన్‌ నిర్ణయించింది. భవిష్యత్తులో దీనిని వంద పడకల ఆస్పత్రిగా ఆధునీకరించేందుకు కూడా నిర్ణయించింది. ఈ ఆస్పత్రిని “మీరు నిర్వహిస్తారా? మమ్మల్ని నిర్వహించమంటారా?” అంటూ 2020 డిసెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయగా మీరే నిర్వహించుకోండని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలియజేసింది.

గుణదల ఆస్పత్రి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరితో వుంది. దీనిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్రం తన లేఖలో కోరింది.  కాగా, గుణదల ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని ఇతర ఇఎస్‌ఐ ఆస్పత్రులకు బదలాయించేరదుకు రాష్ట్రం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తోంది.

అయితే వారి సేవలను ఇతర చిన్న ఆస్పత్రుల్లో ఎలా వినియోగించుకుంటారన్నది మాత్రం తెలియడం లేదు. ఇదే సమయంలో ఆస్పత్రిని పూర్తిగా స్వాధీనం చేసుకునే సమయాన్ని ముందుగానే తమకు చెబితే, ఏర్పాట్లు చేసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ఐ కార్పొరేషన్‌కు స్పష్టం చేశారు.