వివేకా కేసులో అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్టు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు  పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.
గూగుల్ టేక్ ఔట్ సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ నిర్వహించింది. వివేకా హత్య రోజు నిందితులతో కలిసి ఉదయ్ కుమార్ రెడ్డి తిరిగినట్టు అధికారులు గుర్తించారు.  హత్యలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. తన కుమారుడు అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా నిందితులతో తిరిగాడని ఉదయ్ తల్లి బహిరంగంగా చెప్పారు.
పులివెందులలో ఆయనను అదుపులోకి తీసుకొని,  అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి విచారణ జరిపారు.  సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కాసేపట్లో ఆయనను కడప నుంచి హైదరాబాద్ కు సీబీఐ అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు, ఉదయ్ ను అరెస్ట్ చేసిన ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారమిచ్చారు.
 
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పాటు ఉదయ్ కూడా ఘటనా స్థలానికి వెళ్లినట్టు సీబీఐ గుర్తించింది. ఆ రోజున అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను అక్కడికి రప్పించడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించినట్టు భావిస్తోంది. అంతేకాదు, వివేకానందరెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
గత సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై ఉదయ్ కుమార్ కేసు పెట్టగా,  అప్పట్లో తనని వేధింపులకు గురిచేస్తున్నాడని రామ్ సింగ్ పై ఆరోపణలు చేశాడు. వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో ఉదయ్ తండ్రి ప్రకాశ్ రెడ్డి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.ఉదయ్‌ను సీబీఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది. ఇప్పుడు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది.